గత వారం పది రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు మళ్లీ విజృంభించాడు. దాదాపు రెండు వారాల విరామం తర్వాత తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈశాన్య బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం కొనసాగిన అల్పపీడన ద్రోణి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలకు విస్తరించిందని తాజా వాతావరణ విశ్లేషణ సూచిస్తుంది.
తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని సూచించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒరిస్సా తీరాల మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో గ్రీన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు.
ఇక రేపు కూడా పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం,సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
శుక్రవారం సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షం కురిసిందని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో 4.8 మిమీ, అల్వాల్‌లో 4.3 మిమీ, త్రిముల్‌ఘేరిలో 4 మిమీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చేల్పూర్‌లో 7.95, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6, భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 5.76 సెం.మీ. వర్షం పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6, ఏటూరునాగారంలో 5.1, వెంకటాపురంలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వీటితోపాటు మంచిర్యాల, కుమురంభీమ్-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్‌తోపాటు శివార్లలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..