
ఈ ఏడాది నైరుతి ముందే పలకరించే సరికి రైతులు పులకరించిపోయారు. నైరుతి కేరళ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిందన్న మాటే గానీ.. ఆ తరువాత అడ్రస్సే లేకుండా పోయింది. ఒకానొక దశలో పొలాలు బీడులువారాయి. వర్షపుజాడ కోసం అన్నదాతలు నింగికేసి చూస్తే సుర్రుమనిపించే ఎండలు, ఉక్కపోతలే కనిపించాయి తప్పితే.. మేఘాల్లేవ్. ఇక ఈ సీజన్ ఇంతేనేమో అనుకుంటుండగా… దంచికొట్టే వానలతో నేలమీదకి దిగాయి మేఘమాలలు. ఒక్కో ప్రాజెక్ట్ నిండుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వరదలు రోడ్లను ముంచెత్తుతున్నాయా. కానివ్వండి కాసేపలా భరిద్దాం. జడివానతో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతున్నామా. కొత్తేం కాదుగా మనకి.. ఏ పాటలు వింటూనో, రీల్స్ చూస్తూనో సమయాన్ని గడిపేద్దాం. మరీ ఇళ్లల్లోకి నీళ్లొచ్చినా కూడా భరించాలా. చేసేదేం లేదుగా చిరాకుగా ఉన్నా ఆ జలతరంగిణి ఆహ్వానిద్దాం. కాకపోతే జాగ్రత్తపడదాం. అధికారులు చెప్పేది విందాం. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉందాం. ఈ సీజన్‌లో కాకపోతే ఇంకెప్పుడు పడతాయి ఈ వానలు. ఏడాదంతా కడుపు నిండాలంటే రిజర్వాయర్లన్నీ నిండుగా ఉండాలిగా. ఆ ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉంటేనే.. మధ్యలో వానలు కురవకపోయినా, సమ్మర్‌లో ఎండలు ఠారెత్తించినా, మళ్లీ నైరుతి పలుకరించేదాకా ఇప్పుడు ప్రాజెక్టుల్లో ఒడిసిపట్టి ఉంచిన నీళ్లే మనకు ఆధారం. సో, ప్రాజెక్టులు, వాటిల్లోని నీటి నిల్వలు, వస్తున్న ఇన్‌ఫ్లో, వెళ్తున్న ఔట్‌ఫ్లో చూస్తే.. కర్నాటకలోనూ వర్షాలు దంచికొడుతుండడంతో కృష్ణానది పోటెత్తుతోంది. జూరాల రిజర్వాయర్ నుంచి లక్షా 4వేల 628 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అటు సుంకేసుల ప్రాజెక్ట్...