తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాల్లోనే అధిక ఉష్ణోగ్రతలు.. బయటకు రావొద్దంటూ IMD హెచ్చరిక..

|

Apr 26, 2024 | 7:06 PM

28న నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వడగాలులు అధికంగా వీస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. 29న నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలు, 30న కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వడగాలలు వీస్తాయని చెప్పింది.

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాల్లోనే అధిక ఉష్ణోగ్రతలు.. బయటకు రావొద్దంటూ IMD హెచ్చరిక..
Heat Waves
Follow us on

మే నాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని, దీని ఫలితంగా ఉత్తర, మధ్య భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ మార్కును దాటింది. రాబోయే వారంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దాదాపుగా 50డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అదే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలేవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది.

హైదరాబాద్‌లో కూడా ఈ వారం మొత్తం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా 42-43 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. అయితే ప్రస్తుతానికి హీట్ వేవ్ హెచ్చరిక నుండి తప్పించుకుంది. ఆదిలాబాద్, కొత్తగూడెం , హన్మకొండ, భూపాలపల్లి, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాలు, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ , నారాయణపేట వంటి తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఏప్రిల్ 26 నుండి మే 7 వరకు వేడిగాలులు..

ఇవి కూడా చదవండి

సూర్యాపేట, వనపర్తి మొదలైన ప్రాంతాల్లో ఈ వారంలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండలో 45.1 డిగ్రీల సెల్సియస్‌, కొత్తగూడెంలో 44.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, మెట్టుగూడతో పాటు బంజారాహిల్స్ సీఎంటీసీ ఆవరణలో 43 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది రాబోయే వేడి వారం ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ఉత్తర భారతదేశం నుండి రాష్ట్రంలోకి వేడి పొడి గాలులు వీస్తున్నాయని, ఇది వాతావరణంలో వేడి పొడి పరిస్థితులకు దారి తీస్తుందన్నారు. ప్రత్యేకించి, నాలుగు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో ఏప్రిల్ 27 నుంచి తీవ్రమైన హీట్‌వేవ్స్ కొనసాగుతాయని IMD అధికారి తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. 28న నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వడగాలులు అధికంగా వీస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. 29న నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలు, 30న కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వడగాలలు వీస్తాయని చెప్పింది.

వాతావరణ పరిశీలకులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. “ఏప్రిల్ 26 నుండి మే 7 వరకు పరిస్థితులు చాలా దారుణంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..