AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వీళ్ల స్నేహానికి చావే సలాం కొట్టింది.. గుండెల్ని హత్తుకునే 40 ఏళ్ల అనుబంధం.. చివరకు..

కాలం మారినా చెరిగిపోని స్నేహాలుంటాయి.. ప్రాణం పోయినా వీడిపోని బంధాలుంటాయి.. నాలుగు దశాబ్దాల పాటు ఒకరికొకరు నీడలా బతికిన ఆ ఇద్దరు మిత్రులు, చివరకు చావులోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. మిత్రుడు కానరాని లోకాలకు వెళ్లాడన్న వార్త విన్న మరుక్షణమే.. గుండె పగిలి మరో ప్రాణం కూడా అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఏం జరిగిందంటే..?

Telangana: వీళ్ల స్నేహానికి  చావే సలాం కొట్టింది.. గుండెల్ని హత్తుకునే 40 ఏళ్ల అనుబంధం.. చివరకు..
Friends Die On Same Day Medak
P Shivteja
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 3:14 PM

Share

జీవితాంతం తోడునీడగా నిలిచిన ఆ ఇద్దరు మిత్రుల స్నేహబంధం మృత్యువులోనూ వీడిపోలేదు. నాలుగు దశాబ్దాలుగా సుఖదుఃఖాలను పంచుకున్న ఆ ప్రాణ స్నేహితులు చివరకు లోకాన్ని వీడటంలోనూ ఒకరినొకరు వీడలేకపోయారు. మిత్రుడి మరణవార్త విన్న క్షణాల్లోనే మరొకరు తీవ్ర దిగ్భ్రాంతితో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచిన హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకుట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కూకుట్లపల్లి గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య (60), గొల్ల అంజయ్య (60) ఇద్దరూ దాదాపు 40 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు. కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన మల్లయ్య ఎన్నో ఏళ్ల క్రితం కూకుట్లపల్లికి ఇల్లరికం వచ్చారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన అంజయ్యతో ఏర్పడిన పరిచయం కాలక్రమేణా గాఢమైన స్నేహంగా మారింది. గ్రామంలో ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే కనిపించేవారు. ఒకరికి కష్టమొస్తే మరొకరు కొండంత అండగా నిలబడేవారు.

మిత్రుడి మరణాన్ని తట్టుకోలేక..

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చాకలి మల్లయ్య సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే గొల్ల అంజయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 40 ఏళ్లుగా కళ్లముందే తిరిగిన మిత్రుడు ఇక లేడన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన అంజయ్యకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు తేరుకునేలోపే ఆయన అక్కడికక్కడే కుప్పకూలి కన్నుమూశారు.

గ్రామంలో మిన్నంటిన రోదనలు

కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణమిత్రులు లోకాన్ని విడిచివెళ్లడంతో కూకుట్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకరి చితి ఆరకముందే మరొకరి అంత్యక్రియలు జరగడం చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ‘‘జీవించినంత కాలం కలిసే ఉన్నారు.. చివరకు పోయేటప్పుడు కూడా ఒకరినొకరు వీడలేకపోయారు’’ అంటూ స్థానికులు ఆ ఇద్దరి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us