కరీంనగర్‌లో పండగ పూట పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది. ఇటీవల కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీది ఏ పార్టీ అంటూ ఎమ్మెల్యే సంజయ్‌ని కౌశిక్ రెడ్డి నిలదీసిన క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పనిచేశారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. పక్కనే ఉన్న వాళ్లు.. స్టేజ్‌పై ఉన్న ముగ్గురు మంత్రులు వారించారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురిని బయటకు తీసుకెళ్లారు. ఈ గొడవ ఇప్పుడు మరింత రాజుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే సోమవారం(జనవరి 13)న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. మొదట కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కి.. ఆ తర్వాత కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లోనే కౌశిక్‌కు నోటీసులు అందజేశారు. కరీంనగర్ త్రీటౌన్ పీఎస్‌లోనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు, రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మరోవైపు కరీంనగర్‌లో అర్థరాత్రి బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
కరీంనగర్ కలెక్టరేట్‌లో కొట్లాట విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వన్ టౌన్ పీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. తమ ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారంటూ ఆయన పీఏ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై మొదటి కేసు పెట్టారు పోలీసులు. కరీంనగర్ కలెక్టరేట్‌లో గదరగోళం సృష్టించారంటూ RDO పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై రెండో కేసు నమోదైంది. ఇంకొకటి కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదుచేశారు. అయితే RDO ఇచ్చిన ఫిర్యాదులో ఏయే సెక్షన్లు పెట్టారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.
ఇదిలా ఉంటే కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి తనను దూషించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే సంజయ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. కౌశిక్‌రెడ్డి తనపై దాడి చేయడంతో చేతికి గాయమైందంటున్నారు ఎమ్మెల్యే సంజయ్. తాను ఎవరినీ దూషించలేదని అంటున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌లో చేరినవారు రాజీనామా చేశారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ క్షమాపణ చెబితే తానే రాజీనామా చేస్తా అంటున్నారు సంజయ్.
మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్‌కు కోపం వచ్చిందన్నారు. పోలీసులు వెంటనే కేసులు ఎత్తివేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డిపై కేసుల పెట్టడంపై బీఆర్ఎస్ నేతలు సీరియస్ అయ్యారు. కేటీఆర్, హరీష్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. మరోవైపు కరీంనగర్‌కు చేరిన బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ కౌశిక్‌రెడ్డిపై పెట్టిన కేసులపై ఎంక్వైరీ చేస్తోంది. కేసులపై పోరాడేందుకు రెడీ అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..