గత కొద్ది రోజులుగా తెలంగాణలో కల్లోలం సృష్టించిన గుత్తికోయలకు తెలంగాణలో ఎలాంటి హక్కులూ లేవని తేల్చి చెప్పారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతీ రాథోడ్. గుత్తికోయలు ఈ రాష్ట్ర గిరిజనులు కాదనీ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు వారు అర్హులు కాదనీ వ్యాఖ్యానించారు మంత్రి సత్యవతీ రాథోడ్. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యవతి.. పోడు భూముల కోసం గుత్తికోయలు చేస్తున్న పోరాటంపై స్పందించారు. వారి పోరాటంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గుత్తి కోయలు ఈ రాష్ట్రానికి చెందిన వారే కాదని తేల్చి చెప్పారు. ఈ రాష్ట్ర గిరిజనులే కాని గుత్తికోయలకు పోడు భూముల పట్టాలు వర్తించవని, ఏ రిజర్వేషన్లూ అప్లై కావని స్పష్టం చేశారు. ఫారెస్టు అధికారులపై జరుగుతోన్న దాడులను మంత్రి తీవ్రంగా ఖండించారు. మృతి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి.
ఇక ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ హత్యతో.. అటవీశాఖ అప్రమత్తమైంది. ఆపరేషన్ వెపన్స్ షురూ చేశారు ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు. గుత్తికోయలు ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల్లో విల్లంబులు, బల్లెంలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. గుత్తికోయల దగ్గర ఆయుధాలు లేకుండా దాడులకు ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు అధికారులు. ఇక తమకు కూడా ఆయుధాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు అటవీశాఖ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..