ఒక్క అంబర్ ప్యాకెట్‌తో అసలు గుట్టు బయటపెట్టింది.. హంటర్ డాగ్‌తో మామూలుగా ఉండదు..
మంచిర్యాల జిల్లాలో సాంబార్ జింక వేట కేసును అటవీశాఖ హంటర్ డాగ్ స్క్వాడ్ ఛేదించింది. ఘటనాస్థలంలో లభించిన అంబర్ గుట్కా ప్యాకెట్ ఆధారంగా నిందితుల జాడను గుర్తించిన హంటర్ డాగ్, ముగ్గురు వేటగాళ్లను పట్టించడంలో కీలక పాత్ర పోషించింది. వన్యప్రాణులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ హెచ్చరించింది.

ఓ గుట్కా ప్యాకెట్ అటవీ జంతువును వేటాడిన నింది తులను పట్టించిన ఘటన మంచిర్యాల చోటుచేసుకుంది. కాసి పేట మండలం దేవాపూర్ అటవీ రేంజ్ పరిధిలో సాంబార్ జింకను కొందరు వేటగాళ్లు వేటాడినట్లు రెండు రోజుల క్రితం అటవీ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అటవిశాఖ సిబ్బంది.. కవ్వాల్ టైగర్ జోన్ లో వేటగాళ్లకు సింహస్వప్నంగా మారిన హంటర్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అటవి ప్రాంతంలో నిందితుడు ఉపయోగించిన ఓ గుట్కా ప్యాకెట్ లభించింది. దాని ఆధారంగా పోలీసులు తనిఖీలు చేపట్టి.. గట్రావ్పల్లిలోని ఇప్పలగూడెనికి చెందిన పేంద్రం విజయ్, సిడాం పవన్, చెడ్మాకి లచ్చును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.. కోర్ట్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు దేవాపూర్ రేంజ్ అధికారి సంతోష్ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దేవాపూర్ సెక్షన్ పరిధిలో ఈ నెల 16న నిందితులు కుక్కలతో జింకను వేటాడి హతమార్చారు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న అటవిశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి ఆదారాలు లభించకపోవడంతో జన్నారంకు చెందిన హంటర్ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. డాగ్ హంటర్.. ఘటన జరిగిన కూతవేటు దూరంలో నిందితుడు ఉపయోగించిన అంబర్ ప్యాకెట్ వాసన ఆధారంగా డాగ్ స్క్వాడ్ గట్రామ్పల్లి పంచాయతీ పరిధిలోని ఇప్పలగూడకు చెందిన విజయ్, పవన్, లచ్చును గుర్తించిందని సంతోష్ తెలిపారు.
ఈ హంటర్ డాగ్ నిందితుల చెమట వాసన, నిందితులు ఉపయోగించిన వస్తువుల వాసనను ఇట్టే పట్టేసి నిందితులను పట్టేస్తుందని అటవిశాఖ సిబ్బంది చెపుతున్నారు. 2025 ఆగస్టు నెలలో ఈ హంటర్ డాగ్ ను మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ కు తీసుకువచ్చారు. ఈ డాగ్ స్వ్కాడ్ గడిచిన ఏడాది కాలంలో 20 కి పైగా కేసులను ఛేదించింది. జన్నారం డివిజన్ కేంద్రంలోని బీట్ అధికారి అనిల్ కుమార్ తో పాటు బేస్ క్యాంపు సిబ్బంది ఈ హంటర్ డాగ్ ఆరోగ్యం, ఆహారం, డైట్ ప్లాన్, వ్యాయామం తదితర విషయాలను చూసుకుంటున్నారు. ఈ డాగ్ సంరక్షణ కోసం బీట్ అధికారికి ప్రత్యేకంగా ఏడు నెలల శిక్షణ కూడా ఇచ్చారు. హర్యానాలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణను పూర్తిచేశారు. ఈ హంటర్ డాగ్ ఎంట్రీతో ఎలాంటి క్లూ లేని క్లిష్టమైన కేసులను సైతం అటవిశాఖ అవలీలగా చేధిస్తుందని చెపుతున్నారు అటవి అధికారులు..

వన్యప్రాణులను వేటాడటం, పట్టుకోవడం, చెట్లను నరకడం లాంటి చర్యలకు పాల్పడిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ఇండియన్ ఫారెస్ట్ యాక్టు, పీడీపీపీ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని సంతోష్ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
