Groundnut Farmers:కర్నాటక(Karnataka) నుంచి తెలంగాణకు భారీగా వేరుశనగ తరలివస్తోంది. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉన్నప్పటికీ, లంచాల రుచి మరిగిన కొంతమంది అధికారులు, వేరుశనగ వాహనాలను ఆపడం లేదు. దీంతో మహబూబ్‌నగర్(Mahabubnagar)వ్యవసాయ మార్కెట్, కర్నాటక రైతులతో కిక్కిరిసిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, వేరుశనగ ధరను ఒక్క సారిగా తగ్గించేశారు. దీంతో గిట్టుబాటు ధర రాక లబోదిబోమంటున్నారు తెలంగాణ రైతులు. 4 రోజుల క్రితం వరకు క్వింటాలు పల్లి 7 వేల 5 వందలు ఉండేది. కానీ, ఇప్పుడు అది 5వేల 200కు పడిపోయింది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పది రోజుల కిందటి వరకు గ్రేడ్‌ను బట్టి క్వింటాలు ధర 7వేల 200 నుంచి 7వేల 500 వరకూ చెల్లించారు. కానీ, బుధవారం ఒక్కరాత్రే దాదాపు 40 వేల వేరుశనగ బస్తాలు కర్ణాటక నుండి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా రేటు తగ్గించారు ట్రేడర్లు. అయితే, ఇక్కడి మార్కెట్లో కనీసం 7 వేల రూపాయలు ధర వస్తుందని ఆశిస్తున్నారు కర్ణాటక రైతులు. కానీ ఆ ధరను కూడా ట్రేడర్లు చెల్లించడం లేదు. అటు కర్ణాటక నుంచి భారీగా వేరుశనగను తెస్తున్నా, బార్డర్ల వద్ద మార్కెటింగ్ శాఖ ఆఫీసర్లు ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. పంటల సీజన్‌లో అయినా, జలాల్ పూర్, అమీన్ పూర్, కానుకుర్తి, సజనాపూర్, కొడంగల్, తాండూరులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. అక్కడక్కడా చెక్‌పోస్టులు ఉన్నా, సరిగా తనిఖీలు చేయడంలేదని ఆరోపిస్తున్నారు రైతులు. డీసీఎంలను ఆపి ఒక్కొక్కరి నుంచి 100 నుంచి 200 వరకు వసూలు చేసి పంపిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు అన్నదాతలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తెలంగాణ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు రైతులు.
Also Read: Telangana: గంజాయి పంట వేసిన రైతు.. రైతుబంధు కట్ చేసిన అధికారులు