గుస్సాడి గురువుకు రాజ్‌భవన్‌లో ఘనంగా సన్మానం.. పద్మశ్రీ కనకరాజుతో కలిసి గవర్నర్‌ తమిళిసై గుస్సాడి నృత్యం

గుస్సాడి నృత్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చి, రాష్ట్రానికి గర్వకారణమైన పద్మశ్రీ కనకరాజును సన్మానించడం నాకెంతో సంతోషకరంగా ఉందని..

గుస్సాడి గురువుకు రాజ్‌భవన్‌లో ఘనంగా సన్మానం.. పద్మశ్రీ కనకరాజుతో కలిసి గవర్నర్‌ తమిళిసై గుస్సాడి నృత్యం

Updated on: Feb 01, 2021 | 5:40 PM

గుస్సాడి నృత్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చి, రాష్ట్రానికి గర్వకారణమైన పద్మశ్రీ కనకరాజును సన్మానించడం నాకెంతో సంతోషకరంగా ఉందని రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం, కుమ్రం భీమ్ – ఆసిఫాబాద్ జిల్లా కు చెందిన గుస్సాడి నృత్య గురువు కనకరాజును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించినందున నేడు రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్ రాజన్ కనకరాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. ఆదివాసి సంప్రదాయాలు గౌరవించబడాలనేది నా ఆకాంక్ష అని, ఈ ఆకాంక్ష కనకరాజుకు పద్మశ్రీ రావడం ద్వారా నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్‌ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి కనకరాజు కావడం నిజంగా ఈ రాష్ట్రానికి గర్వకారణం. నాకు గిరిజనులంటే చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లోనే నా భర్త సౌందర్ రాజన్, మిత్రులతో కలిసి గిరిజనుల గురించి అధ్యయనం చేయడానికి అండమాన్ వెళ్లాను. నేను గవర్నర్ కాకముందు నుంచే గిరిజనులతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాను. ఎప్పుడూ వారి సంక్షేమాన్ని కోరుకున్నాను. గిరిజనుల వైద్యానికి ప్రత్యేకత ఉంది. వారి వైద్యం పట్ల పరిశోధన చేయాలి. వోకల్ ఫర్ లోకల్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు స్థానికులకు ప్రాధాన్యత ఉండాలని, వారు స్వయం సమృద్ధి కావాలన్నారు. గిరిజనుల ఆచారం, ఆహార అలవాట్ల వల్ల వారి వయసుకు తగినట్లుగా కాకుండా ఇంకా యవ్వనంగా ఉంటారని గుర్తించినట్లు గవర్నర్‌ తెలిపారు.

గిరిజన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, మిగిలిన గిరిజనుల నుంచి నేను ఎప్పటికప్పుడు గిరిజనుల స్థితిగతులను విచారణ చేస్తుంటాను. ఎందుకంటే గిరిజనులు చాలా అమాయకులు. వారి ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి ఆచార వ్యవహారాలను పాటించే గిరిజనులకు నేడు పద్మశ్రీ పురస్కారంతో కేంద్రం గౌరవించడం నిజంగా ఎంతో సంతోషకరం, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ణతలని తమిళిసై చెప్పారు. తన జీవితాంతం గిరిజన ఆచార వ్యవహారాల్లోని గుస్సాడి నృత్యం కోసం పాటుపడడం, దానికి కేంద్రం ఆయన్న పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. కనకరాజు తండ్రి కూడా గుస్సాడి నృత్యం కోసం చాలా పాటుపడ్డారని, తండ్రి వారసత్వాన్ని కనకరాజు కొనసాగించినందుకు అభినందనీయులన్నారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలి. కళలకు ఇలాంటి పురస్కారం లభించడం వల్ల యువతకు ఇది స్పూర్తి కావాలి. కళలను భావితరాలకు అందించే ఈ వారసత్వాన్ని యువత కొనసాగించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం గిరిజనుల ఆచార వ్యవహారాల పట్ల పరిశోధన చేసే సంస్థను నిర్వహిస్తూ వాటిని పరిరక్షించడం నిజంగా అభినందనీయం. అదేవిధంగా గిరిజనుల అత్యంత ప్రాచీన కళలలో శిక్షణ కల్పించే సంస్థలు నిర్వహించడం కూడా అభినందనీయమన్నారు. కనకరాజుకు ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం పట్ల నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. గిరిజనుల ఆర్ధిక పరిస్థితులు, మౌలిక వసతులు మెరుగుపర్చాలి. మన ప్రాచీన ఈ కళలను కాపాడేందుకు, భావితరాలకు వాటిని అందించేందుకు మనందరం పునరంకితం కావాలని గవర్నర్‌ తమిళిసై చెప్పారు.

ఈ సందర్భంగా గిరిజన ఆదివాసీ ప్రాచీన నృత్యం గుస్సాడిని ప్రదర్శించగా, వయసు పైబడిన కనకరాజు కూడా వేదికనెక్కి గుస్సాడి నృత్యం చేసి అందరిని అలరించారు. ఈ సందర్భంగా కనకరాజుతో కలిసి గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్‌ నృత్యం చేశారు. గుస్సాడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్న గిరిజన కళాకారులందరినీ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర్ రాజన్ ఘనంగా సన్మానించారు.