ఎప్పుడు ఊడిపడుతాయో తెలియని పైకప్పులు. వర్షపు నీటితో పాకురు పట్టిన గోడలు, నీళ్లదారలతో తడిచి ముద్దవుతున్న గదులు. పగిలిపోయి దర్శనమిస్తున్న ఫ్లోర్ టైల్స్.. హఠాత్తుగా దర్శనమిస్తున్న విష సర్పాలు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి. వారం రోజులుగా వర్షాలు దంచి కొడుతుండటంతో ఆ శిథిల భవనాలు మరింత ప్రమాదకరంగా మారి భయపెడుతున్నాయి. నిర్మల్ , ఆదిలాబాద్, మంచిర్యాల , ఆసిఫాబాద్ ఒక్క జిల్లా ఏంటీ.. ఏ ప్రాంతంలో చూసినా ఏమున్నది గర్వకారణం శిథిలమైన భవనం కుప్పకూలేందుకు సిద్దంగా ఉన్న సముదాయం అన్నట్టుగానే ఉంది. హెల్మెట్లు ధరించి విధులు.. గొడుగులు పట్టుకుంటేనే సాగుతున్న చదువులు. శిథిలావస్థకు చేరి మరింత భయపెడుతున్నా పాఠశాల భవనాలు.
ఇదిగో ఇది ఆదిలాబాద్ జిల్లా లోని ప్రధాన మండల రెవెన్యూ కార్యాలయం. 2016 లో కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా అప్పటి ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావలను మండలంగా ఏర్పాటు చేసి పట్టణ శివారు ప్రాంతాన్ని ఈ మండలంలో కలిపింది. కొత్తగా ఏర్పడ్డ ఈ మండలానికి రెవెన్యూ కార్యాలయం లేకపోవడంతో ఇదిగో ఇలా శిథిలమైన భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. దీంతో ఇరుకు గదుల్లో శిథిలమై కుప్పకూలేందుకు సిద్దంగా ఉన్న భవనంలో విధులు నిర్వహించక తప్పడం లేదు మావల మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది.
ఒక్క మావల తహసీల్దార్ కార్యాలయం మాత్రమే కాదు.. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆస్పత్రులు, వెటర్నరీ ఆస్పత్రులు శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే సాగుతున్నాయి. అటు నిర్మల్ జిల్లా లోని పలు ప్రభుత్వ కార్యాలయాలది మావల రెవెన్యూ కార్యాలయం లాంటి దుస్థితే. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భవనం పరిస్థితి అంతే. ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో గత రెండేళ్ల క్రితం కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధికారులు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో శిథిలమైన భవనంలోనే చదువులు సాగిస్తున్నారు. నిర్మల్ మండలం అనంతపేట్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ను అదే పరిస్థితి. చిన్న వర్షం పడిదంటే చాలు క్లాస్ రూం లన్నీ వర్షపు నీటితో నిండిపోతున్నాయి. స్లాబ్ పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు సైతం అవుతున్నాయి. బాత్రూంలు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అటు మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు , ప్రాథమిక వైద్యశాలల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. చెన్నూరు పట్టణంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధ జేబీఎస్ పాఠశాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 500 మంది కి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో భారీ వర్షం కురిస్తే పాఠశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు పాఠశాల లో అడ్మిషన్స్ రద్దు చేసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో అయితే తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో వర్షాలకు పై కప్పు నుంచి నీరు కారుతోంది. దీంతో వారం రోజుల నుంచి విద్యార్థులు గొడుగులు పట్టుకుని బెంచీలపై కూర్చుని మరీ క్లాస్లు వింటున్నారు.
ఇవే కాదు చాలా కార్యాలయాల్లో కూలేందుకు సిద్దంగా ఉన్న శిథిలమైన భవనాలు నిత్యం ఉద్యోగులను , ఉపాద్యాయులను, విద్యార్థులను , సందర్శకులను బయపెడుతున్నాయి. కార్యాలయాల పరిస్థితి ఇలా ఉంటే మూత్రశాలల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కనీసం మహిళ ఉపాద్యాయులు, ఉద్యోగులు ఒంటికి రెంటికి వెళ్లలేని పరిస్థితి. బయట వ్యక్తులెవరైనా వస్తే.. ఇవి ప్రభుత్వ బడులేనా.. సర్కార్ కార్యాలయలేనా అనేటట్టుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన భవనాలు నిర్మించి ప్రాణాలు కాపాడాలను కోరుతున్నారు ప్రజలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…