Godavari River 67 feet: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. అంచనాకు మించి ప్రమాదకరస్థాయికి చేరింది. క్షణక్షణానికి గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో 67.10 అడుగులకు చేరింది. దిగువకు 22.03,857 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉందని పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.
గోదావరి ఉప్పొంగడంతో శాంతి నగర్ కాలనీలో కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపద్యంలో తక్షణమే ఖాళీ చేయాలని స్వయంగా మైక్ పట్టుకొని కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. భద్రాచలం నలువైపులా వరద చుట్టుముట్టడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డ్ వద్ద నేషనల్ హైవే 30 రహదారిపై గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. నేషనల్ హైవేను వరద ముంచెత్తడంతో భద్రాచలం, సారపాక పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇప్పటివరకు 62 గ్రామాలకు చెందిన 10,535 మందిని 48 పునరావాస కేంద్రాలకు తరలించారు. తక్షణమే లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని..అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కలెక్టర్.
మంచిర్యాల..
భారీ వరదలకు మంచిర్యాల జిల్లా కేంద్రం అతాలకుతలమైంది. ఎనిమిది కాలనీలను ముంచెత్తింది గోదావరి, రాళ్లవాగు వరద. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ఇళ్లు కూడా జలదిగ్బందంలో చిక్కుకుంది. వేలాదిమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వరుసగా రెండవ ఏడాది మంచిర్యాలను వరద ముంచెత్తింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..