డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తోన్న ఓ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలున్న ముఠాను అదుపులోకి తీసుకోగా.. ఏ 1గా ఉన్న శేరియర్ అలీ పరారీలో ఉన్నట్టు వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.
శేరియర్ అలీ జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నాడు. 15 లక్షల వరకు ఈ ముఠా అమాయకుల దగ్గరి నుంచి డబుల్ బెడ్‌రూం పేరుతో వసూలు చేసినట్టు గుర్తించారు. 75 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి 15వేల నుంచి 18 వేల వరకు వసూలు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ లోకెన్స్, జీహెచ్‌ఎంసీ ఫేక్ లెటర్ హెడ్స్‌తో అమాయకులను మోసం చేశారు.
డబుల్‌బెడ్ రూం ఇళ్ల విషయంలో కొందరిపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఈ ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి 10 ఫేక్ టోకెన్స్‌తో పాటు ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా డబుల్‌బెడ్ రూమ్స్ ఇప్పిస్తామంటే నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుందని, ఎవరైనా ఇస్తారని అంటే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.