Ganesh Immersion 2023: హైదరాబాద్‌లో కన్నుల పండుగగా గణేష్‌ శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్‌పై క్యూ కట్టిన గణనాథులు..

| Edited By: Ravi Kiran

Sep 28, 2023 | 10:09 AM

నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనం కోసం బయల్దేరాడు. జంట నగరాలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు ట్యాంక్‌బండ్‌ వైపు కదిలాయి. ప్రధాన రహదారుల వెంట సందడి నెలకొంది. నిమజ్జనం మహోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు ట్యాంక్‌బండ్‌కు జనం చేరుకుంటున్నారు. దాంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లో గణేష్‌ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది.

Ganesh Immersion 2023: హైదరాబాద్‌లో కన్నుల పండుగగా గణేష్‌ శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్‌పై క్యూ కట్టిన గణనాథులు..
Khairatabad Ganesh Immersion
Follow us on

Ganesh Immersion 2023: నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనం కోసం బయల్దేరాడు. జంట నగరాలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు ట్యాంక్‌బండ్‌ వైపు కదిలాయి. ప్రధాన రహదారుల వెంట సందడి నెలకొంది. నిమజ్జనం మహోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు ట్యాంక్‌బండ్‌కు జనం చేరుకుంటున్నారు. దాంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లో గణేష్‌ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. రోడ్లన్నీ గణనాథులతో నిండిపోయాయి. తొమ్మిది రోజులు భక్తుల పూజలు అందుకున్న గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరేందుకు వడి వడిగా బయలుదేరుతున్నాడు. వినాయక నిమజ్జనాలకు కోసం జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ నగర వ్యాప్తంగా 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగునుంది. ట్యాంక్‌బండ్‌తో పాటు పలు చెరువులు, రబ్బర్‌ డ్యామ్స్‌, బేబీ పాండ్స్‌లో నిమజ్జనాలు జరుగనున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 భారీ క్రేన్లు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా భద్రతా బలగాల మోహరించాయి. దాదాపు 20వేల సీసీకెమెరాలతో పటిష్టమై నిఘా ఏర్పాటు చేశారు. అలాగే, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 25,694 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో ఆర్‌పీఎఫ్‌, పారామిలిటరీ భద్రతను ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 6 వేల పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరుగనుంది. నిమజ్జన ప్రాంతాల దగ్గర డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ.

ట్యాంక్‌బండ్‌పై మొదలైన సందడి..

గణపతి నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులను తరలిస్తున్నారు. ఒక్కొక్కటిగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతుండగా.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. డ్యాన్సులు చేస్తూ.. నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి తెల్లవారుజాము నుంచే నిమజ్జనానికి గణేష్‌ విగ్రహాలు తరలి వస్తున్నాయి.

నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్ గణేషుడు..

ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనానికి బయలుదేరాడు. 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు.. గంగమ్మ ఒడికి చేరేందుకు పయనమయ్యాడు. ఉదయం 7 గంటలకే మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ఈ శోభాయత్ర కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల వరకు క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు మహా గణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది.

భాగ్యనగరంలో గణేష్‌ శోభయాత్ర రూట్‌..

1. బాలాపూర్‌

2. చంద్రాయణగుట్ట

3. ఫలక్‌నుమా

4. అలియాబాద్‌

5. లాల్‌దర్వాజ

6. షాలిబండా

7. చార్మినార్‌

8. మదీనా క్రాస్‌రోడ్‌

9. అఫ్జల్‌గంజ్‌

10. M.J మార్కెట్‌ క్రాస్‌రోడ్‌

11. లిబర్టీ

12. బషీర్‌బాగ్‌ క్రాస్‌ రోడ్‌

13. ట్యాంక్‌బండ్‌

ఈ రూట్ల మీదుగా గణేషుడు శోభా యాత్ర కొనసాగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..