
గణేష్ నవరాత్రులు కలిసికట్టుగా ఐకమత్యంతో జరుపుకునే వేడుక.. అలాంటి పండుగలను గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన గ్రామ పెద్దలు, మరి కొందరు గ్రూపులుగా విడిపోయారు. గ్రామానికి తెచ్చిన గణేశుడిని ప్రతిష్టించకుండా, పూజలు నిర్వహించకుండా వివాదాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకుంది. ఈ సంఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండలం పీర్జాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు చేయాలని కొందరు గ్రామస్తులు భావించారు. అయితే మరో వర్గం వారు ఇది ఒప్పుకోకుండా తాము ఏర్పాటు చేసిన గణేశుడే ఉండాలని పట్టుబట్టారు. పట్టుదలతో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. గ్రామంలో జరుగుతున్న ఈ వివాదం ఘర్షణలకు తావివ్వకుండా చౌదరిగుడా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆలయంలో ఎవరు గణేష్ విగ్రహాన్ని పెట్టకుండా వేరేచోట పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో మరో వర్గం చేసేది లేక తీవ్ర అసంతృప్తితో గణేశుడిని గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.
పీర్జాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాములు, తిరుపతి, సంగమేష్, కురువ మల్లయ్య కురువ రాముడు, రమేష్ తదితరులు గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో వినాయక ఉత్సవాలను నిర్వహించాలని భావించారు. వినాయక చవితి రోజున గణేశ్ విగ్రహాన్ని గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టించేందుకు నవరాత్రులు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే గ్రామ సర్పంచ్ ఎర్రగుమ్ము నర్సింలు, ఇంకొంతమంది ఆంజనేయస్వామి దేవాలయంలో తాము విగ్రహాన్ని పెడతామని ముందుకు వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇక రెండు వర్గాలు వివాదానికి దిగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
గ్రామంలో పండుగ వేళ ఎలాంటి వివాదాలు ఘర్షణలు చేయకుండా ఆలయంలో ఏ వర్గం విగ్రహాన్ని పెట్టకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఓ వర్గం వినాయక విగ్రహాన్ని నేరుగా గంగమ్మ చెంతకు తీసుకువెళ్లారు.
వినాయకుడికి ఎలాంటి పూజలు నిర్వహించకుండా నవరాత్రులు జరపకుండా గ్రామ చెరువులో నిమజ్జనం చేయడం గమనార్హం. వర్గ విభేదాల కారణంగా వినాయక చవితి నాడే గణనాథుడి విగ్రహ నిమజ్జనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..