ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు ముగిసాయి. రాజకీయాలకు , సిద్దాంతాలకు పార్టీలకు అతీతంగా అంతా గద్దర్ అంతిమ యాత్రలో పాల్గొని ఘన నివాళులు అర్పించారు. అయితే అన్ని పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ ఆయన చివరి మజిలిలో అంతా తానై వ్యవహరించేందుకు ప్రయత్నించింది. గద్దర్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి అంత్యక్రియలు ముగిసే దాకా పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ,సీతక్క, వీహెచ్, మల్లం రవితో పాటు కాంగ్రెస్ నేతలంతా గద్దర్ కుటుంబ సభ్యుల వెంటే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీ సంతాపంప్రకటించారు. రాష్ట్ర నేతలంతా చివరి వరకు గద్దర్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అయితే గద్దర్‌ను కాంగ్రెస్ ఎందుకు అంత ఓన్ చేసుకుందనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. ఎందుకంటే గద్దర్ కాంగ్రెస్ వ్యక్తి కాదు. కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన భావజాలం ఆయనది కాదు. గద్దర్‌కే సొంత రాజకీయ పార్టీ ఉంది. కాంగ్రెస్‌ను విమర్శిస్తూ గతంలో ఎన్నో పాటలు పాడారు గద్దర్. అయినా గద్దర్‌ను తమ సొంత పార్టీ నాయకుడిలా కాంగ్రెస్ ఎందుకు ట్రీట్ చేసిందనే చర్చ వినిపిస్తుంది. ఇది కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలో భాగం అనే ప్రచారం కూడా సాగుతోంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగినప్పుడు గద్దర్ పాల్గొన్న సందర్బాలు ఉన్నాయి. రాహుల్, ప్రియాంక గాంధీలు తెలంగాణ లో పర్యటించిన ప్రతి సారి గద్దర్ ఆయా సభల్లో పాల్గోంటున్నారు. కాంగ్రెస్ పోరాటాలకు బాసటగా నిలుస్తున్నారు. ప్రజలను విధిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల ఓటమి కాంగ్రెస్ తోనే సాద్యమని గద్దర్ బలంగా నమ్మేవారు. అందుకే ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్ జరిగినా అక్కడ గద్దరు ఉండేవారు. సీఎల్పీ నేత బట్టి పాదయాత్రలో సైతం గద్దర్ చాలా రోజులు పాల్గోన్నారు. మరో వైపు గద్దర్ కుమారుడు సూర్య గత ఎన్నికలప్పుడు కాంగ్రెలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక అసెంబ్లీ సీటు టికెట్‌కు ఆయనకు దాదాపు ఖరారు చేశారు. కానీ అది చివరి నిముషంలో మారింది. పెద్దపల్లి సీటు నుంచి ఎంపీగా టికెట్ ట్రై చేసినా అది కూడా వర్క్ అవుట్ కాలేదు.
దీంతో పాటు గద్దర్‌కు ఏలాంటి సహాయం కావాలన్న కాంగ్రెస్ ముందుండేది. అందుకే గద్దర్, కాంగ్రెస్ మధ్య అనుంబంధం ఏర్పడింది. రానున్న ఎన్నికల్లో కూడా గద్దర్ కుమారుడు సూర్యకు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెట్ కానీ, పెద్దపల్లి పార్లిమెంట్ సీట్ కానీ కాంగ్రెస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటి అవసరాల కోసం గద్దర్‌ను భుజాన వేసుకోలేదు, గద్దర్ స్వభావం వల్లే కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా అండగా నిలిచారని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు ఎన్ని చెప్పినా గద్దర్ ను కాంగ్రెస్ కు ఎందుకు ఓన్ చేసుకుందనే అనుమానం ఎక్కడో తడుతుంది.. దీనికి సమాధానం భవిష్యత్ చెపుతుందంటుంన్నారు రాజకీయ విశ్లేషకులు.