Etela Rajender Join to BJP: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మూడు రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు రాజేందర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. దీంతోపాటు ఈ రోజు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఈ రోజు ఈటల రాజేందర్.. స్పీకర్‌ను కలిసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను అందించనున్నట్లు సమాచారం.
కాగా.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 13 న ఆయన బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. అదేరోజు ఆయన వెంట పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం మాజీ నేత తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ తన అభిమానులు, హుజూరాబాద్ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. ఈటల బీజేపీలో చేరిన అనంతరం పలు గ్రామాలకు చెందిన కేడెర్ కూడా ఆ పార్టీలోకి వస్తుందని పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే.. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్.. పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎమ్మెల్యే, మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా కొందరు నాయకులు పేర్కొంటున్నారని.. ఆ పదవులు ఇవ్వమని తానెప్పుడూ అడగలేదన్నారు. ఏ పదవి ఇచ్చినా సంపూర్ణంగా న్యాయం చేశానన్నారు. తనను ఎమ్మెల్యేగా ఎలా తొలగించాలా అని కొందరు ఆలోచన చేస్తున్నారని వారు తొలగించేలోగా తానే పదవిని వదులుకుంటానంటూ ప్రకటించారు. ఎవరో రాసిన లేఖతో వెంటనే విచారణ ఎలా చేస్తారంటూ పేర్కొన్నారు.
Also Read: