
బీఆర్ఎస్.. ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదన్నారు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్. విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్‌పై వ్యతిరేక ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదంటూ సీరియస్ అయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కు పోతోంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని కేడర్‌కి సూచించారు.
తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోంది. ఆ పార్టీ ఇక పైకి లేవడం కష్టమన్నారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదుకు ఇన్‌ఛార్జ్‌గా హరీష్‌రావును నియమించారు. త్వరలోనే మహిళా కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు కేసీఆర్.
ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు తో పాటు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు. 25 ఏండ్ల బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..