Missing Tigers: దరిగాం అడవుల్లో బెబ్బులి అరణ్యరోదన.. కనబడకుండా పోయిన ఆ పులులు క్షేమమేనా?

| Edited By: Basha Shek

Jan 12, 2024 | 6:51 AM

దండకారణ్యం సర్చ్ ఆపరేషన్‌తో దద్దరిల్లిపోతోంది. మునుపెన్నడు లేనివిధంగా అటవిశాఖ బూట్ల చప్పుల్లతో మారుమోగిపోతోంది. ఆ ఆపరేషన్ సాగుతోంది. ఏ మావోల కోసమో దాచి ఉంచిన మావోయిస్ట్ ల డంప్ కోసమో కాదు.. అంతకు మించిన పర్యావరణ హితం కోరే ప్రాణి కోసం. అదే బెబ్బులి.. ఇప్పుడు ఆ బెబ్బులి కాగజ్‌నగర్ కారిడార్ లో అటవిశాఖకు‌ నిద్రలేని రాత్రులను మిగిలిస్తోంది. ఒక్క నిర్లక్ష్యం ఒకే ఒక్క నిర్లక్ష్యం..

Missing Tigers: దరిగాం అడవుల్లో బెబ్బులి అరణ్యరోదన.. కనబడకుండా పోయిన ఆ పులులు క్షేమమేనా?
Search Operation In Darigam Forests
Follow us on

కొమురం భీం, జనవరి 11: దండకారణ్యం సర్చ్ ఆపరేషన్‌తో దద్దరిల్లిపోతోంది. మునుపెన్నడు లేనివిధంగా అటవిశాఖ బూట్ల చప్పుల్లతో మారుమోగిపోతోంది. ఆ ఆపరేషన్ సాగుతోంది. ఏ మావోల కోసమో దాచి ఉంచిన మావోయిస్ట్ ల డంప్ కోసమో కాదు.. అంతకు మించిన పర్యావరణ హితం కోరే ప్రాణి కోసం. అదే బెబ్బులి.. ఇప్పుడు ఆ బెబ్బులి కాగజ్‌నగర్ కారిడార్ లో అటవిశాఖకు‌ నిద్రలేని రాత్రులను మిగిలిస్తోంది. ఒక్క నిర్లక్ష్యం ఒకే ఒక్క నిర్లక్ష్యం.. ఇప్పుడు ఆరు డివిజన్ల పరిదిలోని అటవిశాఖ సిబ్బందిని దరిగాం అడవిలో తిష్టవేసేలా చేసింది. ఇంతకీ కాగజ్ నగర్ కారిడార్ లో ఏం జరుగుతోంది. యుద్ద వాతవరణాన్ని తలపించేలా వందల కొద్ది అటవిశాఖ బలగం అరణ్యంలో ఏం చేస్తోందో తెలుసుకుందాం. కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా.. జల్ జంగిల్ జమీన్ అంటూ గర్జించిన నేల. ఇప్పుడు అటవిశాఖ సర్చ్ ఆపరేషన్ తో దద్దరిల్లిపోతోంది. కారణం బెబ్బులి.. జీవవైవిద్యానికి‌ మారుపేరుగా నిలుస్తున్న కొమురంభీం అడవుల్లో ఇప్పుడు ఆ బెబ్బులి మరణం అరణ్య రోదనై ద్వనిస్తోంది. ఎవరు చంపారో తెలియదు.. ఎలా చనిపోయాయో తెలియదు. రెండు రోజుల వ్యవదిలో రెండు పులులు మరణించడం సంచలనంగా మారింది.

కాగజ్ నగర్ కారిడార్ లోని కాగజ్ నగర్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో‌ ఉన్న గ్రామం దరిగాం.. చుట్టూ కొండలు గుట్టలు.. సెలయేల్లు.. ఈ ప్రాంతంలో డిసెంబర్ 27 న ఓ పశువు పులి‌దాడిలో హతమైంది. ఆ సమాచారాన్ని అటవిశాఖ డిసెంబర్ 30 న గుర్తించి. ఎప్పటిలాగే పశువు మృతదేహాం వద్ద ట్రాప్ కెమెరాను అమర్చి పులి కదలికలను‌ కనిపెట్టి దాన్ని రక్షించాల్సిన అటవి శాఖ ఈ సారి ఎందుకో నిర్లక్ష్యం వ్యవహరించి. అంతే ఆ ఒక్క నిర్లక్ష్యం ఇప్పుడు ఏకంగా ఆ అడవిపై అటవిశాఖ యుద్దం ప్రకటించేంత క్లిష్ట పరిస్థితులను క్రియేట్ చేశాయి. కారణం జనవరి 3 న దరిగాం అటవి ప్రాంతంలోని కొమురంభీం కాలువకు సమీపంలోని ఓ వాగు వద్ద నీళ్లు తాగేందుకు వచ్చి 18 నెలలున్న ఆడపులి చనిపోవడం. ఈ విషయాన్ని సైతం అటవిశాఖ ముందుగా గుర్తించలేదు. పశువుల కాపరులు జనవరి 6 న అటవిశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆడపులి మృతి బయటపడింది. ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం పులి శరీర భాగాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ కు పంపించారు. అంతటితో పులి కథ ముగిసిందనుకున్నారు అటవిశాఖ. కానీ అసలు‌ విషయం అక్కడే జరిగింది. అటవిశాఖ షాక్ అయ్యేలా ఆడపులి చనిపోయిన కూతవేటు దూరంలో మరో పులి చనిపోవడం.. ఆ పులి మెడ చుట్టు ఉచ్చు బిగిసి‌ ఉండటం సంచలనంగా మారింది. వెంటనే అలర్ట్ అయిన అటవిశాఖ హుటాహుటిన ఉన్నతాదికారులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్టాయి.

మాటు వేసి.. మందు పెట్టి

పులి మరణానికి ఆదిపత్య పోరు కారణం కాదని.. ఎవరో మాటు వేసి మందు పెట్టి రెండు బెబ్బులను హతమార్చారని తేలడంతో జిల్లా అటవిశాఖ అప్రమత్తమైంది. ఎన్టీసీఏ , పీసీసీఎఫ్ చీఫ్ ఆర్ఎం డెబ్రియాల్ రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో అసలు గుట్టు రట్టైంది. పులులు చనిపోయింది పశువు మాంసం తినడం కారణంగానేనని.. ఆ పశువు చనిపోయాక దాని పై గడ్డి మందు చల్లి, విషగులికలు కలిపారని.. ఆ ఎద్దు మాంసం తిన్న పులులు నీళ్లు తాగేందుకు వెళ్లి హతమయ్యాయని తేలింది. అయితే చనిపోయింది రెండు పులులే అయినా.. మరో రెండు పులులు మిస్ అవడం అటవిశాఖ ఆందోళనను అమాంతం పెంచేసింది. దీంతో కనిపించకుండ పోయిన ఆ రెండు పులుల ఆచూకీ కోసం హైలెవల్ సర్చ్ ఆపరేషన్ కు రెడీ అయింది అటవిశాఖ. జనవరి 10 న 14 బృందాలతో 98 మంది సిబ్బందితో కే 15, ఎస్ 9 పులులు చనిపోయిన ప్రాంతం నుండి చుట్టూ మూడు కిలో మీటర్ల మేర సర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. 73 క్యాంప్ కు చెందిన టీంకు 11, 12 అడుగుల పాదముద్ర లభించడంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది. సీన్ కట్ చేస్తే ఆ పులి‌పాదముద్ర తప్పి పోయిన పులుల పాదముద్ర కాదని తేలడంతో మరింత టెన్షన్ కు గురైంది. దీంతో ఇక లాభం లేదనుకున్న పీసీసీఎఫ్ ఛీప్ మరిన్ని టీంలను రంగంలోకి దింపాలంటూ ఆదేశించడంతో రెండవ రోజు ఏకంగా ఆరు డివిజన్లో 72 బృందాలతో కాగజ్ నగర్ కారిడార్ లోని నలువైపులా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ గాలింపు చర్యలో ఇప్పటివరకు ఎస్ 6 ఆచూకీ లభించకపోవడంతో అసలు ఆ పులి ప్రాణాలతోనే ఉందా లేక మరేదైనా ఊహించని ప్రమాదం జరిగిందా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. మరో వైపు పులుల మరణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టిన అటవిశాఖ వాంకిడి మండలంలోని చిత్తరేట్, సర్కపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు అనుమానితులని అదుపులోకి‌ తీసుకొని‌ విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

జనవరి 6 న.. కే15 ఆడపులి చనిపోయిన ప్రాంతం నుండి‌ 50 కిలో మీటర్ల పరిదిలో నలు దిక్కులా టైగర్ ఆపరేషన్ కొనసాగిస్తున్న అటవిశాఖ సిబ్బందికి కొత్త పులుల పాదముద్రలు లభిస్తుండగా అసలు పశు మాంసం తిన్నట్టుగా బావిస్తున్న ఎస్ 6, కే 16 పులుల ఆచూకీ మాత్రం చిక్కడం లేదు. ఈ రెండు టైగర్స్ కోసం సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో మంచిర్యాల , బెల్లంపల్లి , చెన్నూర్ , ఆసిపాబాద్ , కాగజ్‌నగర్‌ డివిజన్ల నుండి 380 మంది 72 బృందాలుగా విడిపోయి సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా… మరో వైపు ఆ రెండు పులుల మర్డర్ మిస్టరీలో పులి గోర్లు, శరీర భాగాల కోసమే పులులను మాటు వేసి మాయం చేశారన్న అనుమానాలు సైతం తెర మీదకొస్తున్నాయి. అయితే డిసెంబర్ 27 నే అటవిశాఖ పశు కళేబరాన్ని గుర్తించినా.. లేక ఆ కళేభరం వద్ద ట్రాప్ కెమెరా ఏర్పాటు చేసి ఇంత ప్రమాదం ఉండక పోయేదన్న మాట వినిపిస్తోంది.

దరిగాంలో పులులెన్నీ..? మిస్ అయినవి క్షేమమేనా..?

ఇంతకీ పులుల మృతికి కారణం ఏంటి.. ఎస్ 9 పులి మెడకు ఉచ్చు బిగించింది ఎవరు.. విష ప్రయోగం జరిగింది పశువుపైనే అయితే ఆ పశువు మాంసం తిన్న పులులెన్ని. ఇలా అనేక అనుమానాలు‌ ఇప్పుడు ట్రాక్ చేస్తున్న సర్చ్ టీం మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఉన్నతాదికారులకు సైతం పులి వరుస మరణాలు అంతుపట్టడం లేదు. అనుమానితులను‌ ఓ వైపు‌విచారిస్తూనే వారిస్తున్న సమాచారంతో గాలింపును మరింత ముమ్మరం చేసింది అటవిశాఖ. దరిగాం అటవి ప్రాంతంలో 18 నెలలున్నా కే 15 ఆడపులి మొదటగా చనిపోయి పశువుల‌ కాపారుల కంట పడటం.. ఆ తర్వాత రోజే అటవిశాఖకు ఐదేళ్ల వయసున్న ఎస్ 9 మృతి చెంది కనిపించడం.. మగ బెబ్బులి మెడకు ఉచ్చు బిగించి ఉండటం సంచలనం రేపింది. దీంతో రంగంలోకి‌ దిగిన పీసీసీఎఫ్ చీప్ ఆర్ఎం డోబ్రియాల్ టీం.. అసలు‌ దరిగాం పారెస్ట్ లో సంచరిస్తున్న పులులెన్నీ.. మృతి చెందిన పులుల మిస్టరీ ఏంటి అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. దరిగాం అటవి ప్రాంతంలో ఏకంగా ఆరు పులులు సంచరిస్తున్నాయని తేలడంతో ఇప్పుడు ఆ ఆరింటిలో రెండు చనిపోయాయని.. రెండు మిస్ అయ్యాయని తేలడం అసలు టెన్షన్ కు కారణం అయింది.

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ లోని దరిగాం, గోంది , సర్కపల్లి అటవి ప్రాంతం పులులకు ఆవాసం గా మారడంతో వలస వచ్చిన పులులు ఇక్కడే ఆవాసం ఏర్పాటు‌ చేసుకున్నాయి. అలా వచ్చిన పులుల్లో ఎస్ 9 తో ఎస్ 6 ఆడపులి జతకట్టగా.. నాలుగు పిల్లలు జన్మించాయి. వాటికి కే 14, 15, 16, 17గా నామకరణం చేశారు ఇక్కడి అదికారులు. ఇందులో మూడు రోజుల కిందట ఎస్ 9 అనే మగపులి, కే 15 అనే ఆడపులి పిల్ల మృతి చెందడం.. ఎస్ 6 , కే 16 మిస్ అవడం సంచలనంగా మారింది. వాటికోసం మూడు రోజులుగా గాలింపు చేపట్టిన అటవిశాఖకు కే 14 ఆచూకీ లభించగా.. ఎస్ 6 , కే 16 జాడ కానరాలేదు.

గడ్డి మందే పులులను బలి తీసుకుందా?

అయితే పులుల మరణాలపై స్థానిక దరిగాం , సర్కపల్లి‌, గోంది గ్రామాల ప్రజలు మౌనం దాల్చడం.. వేల రూపాయల విలువ చేసే పశువు చనిపోయినా ఫిర్యాదు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గత మూడు నెలల కాలంలో ఇదే అటవి ప్రాంతంలో ఆరు పశువులు పులి‌దాడిలో చనిపోగా పశు యజమానులకు‌అటవిశాఖ పరిహారం ఇవ్వకపోగా.. కనీసం ఫిర్యాదు కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో స్థానికులు పులుల మీద మరింత కోపం పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ కోపంతోనే బెబ్బులిని‌ హతం చేశారా లేక వేట గాళ్లు ఎంట్రీ ఇచ్చి పక్కా స్కెచ్ వేసి పశువును ఎరగా వేసి పులులను హతమార్చారా తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆరుగురు అనుమానితులను‌అదుపులోకి‌ తీసుకున్న అటవిశాఖ విచారణలో పక్కా ఆదారలను సంపాదించినట్టుగా తెలుస్తోంది.

పులుల మృతికి కారణమైన పశువు కళేబరం కి విషాహారం పెట్టినట్టుగా అటవిశాఖ గుర్తించింది. అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివరాలు బయటకి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది అటవిశాఖ. మిస్ అయిన రెండు పులుల కోసం దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న అటవిశాఖ ట్రాక్ టీం అభయారణ్యం లో అనుమానస్పందంగా కనిపించిన ఇద్దరు మైనర్ పశువుల కాపరులను అదుపులోకి తీసుకుని.. లోతుగా విచారించడంతో రెంగరేట్ గ్రామానికి చెందిన కోవ జంగు, ఆత్రం జలపతి, కొమ్రం చందు, మదావి నాగుల వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. అటవిశాఖ అదుపులో ఉన్న నిందితుల వద్ద నుండి ఒక గడ్డి మందు డబ్బా.. గొడ్డలి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అటవిశాఖ అదికారులు మాత్రం అదికారికంగా వెల్లడించడం లేదు. అటవిశాఖ అదుపులో ఉన్న వారు నిందితులేనా.. లేక అమాయకులను పులి కేసులో ఇరికించే ప్రయత్నాలు సాగుతున్నాయా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.