AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నాడు ముంపు.. నేడు పెద్ద పులులు.. మరోసారి కనుమరుగు కానున్న గ్రామం.. !

దేశవ్యాప్తంగా పెద్దపులుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే దేశంలోని పెద్దపులుల అభయరణ్యాలలో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్టీసీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Telangana: నాడు ముంపు.. నేడు పెద్ద పులులు.. మరోసారి కనుమరుగు కానున్న గ్రామం.. !
Tigers Sanctuaries
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 30, 2024 | 3:52 PM

Share

దేశంలోనీ అభయరణ్యాల్లో పులుల సంరక్షణకు అటవీ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అటు పులులకు, ఇటు మనుషులకు నష్టం జరగకుండా, పులుల ఆవాస ప్రాంతాన్ని పెంచడానికి చర్యలు చేపట్టింది. అయితే పులుల సంరక్షణ పేరు చెబుతేనే ఆ గ్రామం వణికిపోతోంది. నాడు ముంపు పేరుతో.. నేడు పులుల పేరుతో మరోసారి కనుమరుగు కానున్న ఆ గ్రామం విలవిలలాడుతోంది. ఆ పులులకు ఆ గ్రామానికి ఉన్న సంబంధం ఏంటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

దేశంలో పెద్దపులుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే దేశంలోని పెద్దపులుల అభయరణ్యాలలో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్టీసీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సింహభాగం పెద్దపులులున్న అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఇటీవల వీటి సంఖ్య మరింత పెరిగింది. పెద్దపులుల ఆవాసానికి ఎన్టీసీఏ పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద అభయరణ్యాలుగా పేరున్న నాగార్జునసాగర్, శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్‌ ఏరియాలో నివాసముంటున్న వారిని ఇతర గ్రామాలకు తరలించడంపై దృష్టి సారించింది.

నల్లగొండ జిల్లా నేరేడుగోమ్మ మండలం అడవి లోపల ఉండే పొగిళ్ల, రేకులవలయం గ్రామాలను జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) స్వచ్ఛంద గ్రామ తరలింపు కార్యక్రమం (వీవీఆర్‌పీ) కింద మైదాన ప్రాంతానికి తలించేందుకు కసరత్తు ప్రారంభించింది. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వాటి సంరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మెరుగైన జీవన స్థితిగతులను కల్పిం చేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం పోగిళ్ళలో రెండు వేల జనాభా ఉండగా 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడి రైతులు నాగార్జునసాగర్‌ వెనుక జలాల నుంచి కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ ఏర్పాటు చేసుకొని రెండు వేల ఎకరాల్లో పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ మిర్చి, పత్తి అధికంగా సాగవుతుండటంతో పక్క గ్రామాల నుంచి కూడా కూలీలు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాన్ని అటవీ శాఖ అధికారులు ఖాళీ చేయమంటుండడంతో అందరి పరిస్థితీ అయోమయంగా మారిందనీ గ్రామస్తులు వాపోతున్నారు.

తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎందరో గ్రామాలు, ఇల్లు, భూములను త్యాగం చేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ముంపుకు గురైన సూర్యాపేట వాసులకు అప్పటి పాలకులు చందంపేట మండలం పోగిళ్లలో పునరావాసం కల్పించారు. అరకొర పునరావాసంతో 60 ఏళ్లు క్రితం చెట్లు, రాళ్లు రప్పలే ఉన్న ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారు. భూమిని బాగు చేసుకొని, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దీంతో పోగిళ్ల గ్రామానికి ఓ రూపం వచ్చింది. నాగార్జున సాగర్‌ వెనుక జలాల నుంచి దాదాపు 5 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ ఏర్పాటు చేసుకొని రెండు వేల ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే బతుకు బండి గాడిలో పడుతున్న సమయంలో పులుల సంరక్షణ పేరుతో గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ అటవీ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, గ్రామాన్ని వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు.

ఈ ప్రాంతం అమ్రాబాద్ పులుల అభయారణ్యం కావడంతో వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాటి బారి నుంచి గ్రామస్థులను కాపాడేందుకు..గ్రామాన్ని అభయారణ్యంలో విలీనం చేసి వారిని సేఫ్ జోన్ కు తరలించేందుకు అటవీ శాఖ అధికారులు గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పొగిళ్ల గ్రామం పూర్తిగా అభయారణ్యంలోకి విస్తరిస్తుందని, ఈ మేరకు ఇక్కడున్న వారు అంగీకరిస్తే దేవరకొండసమీపంలోని ముదిగొండ వద్ద పునరావాసం కల్పిస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు భూమికి బదులు భూమి, ఇళ్లు,18 ఏళ్లకు పైబడిన యువతీ, యువకులకు అర్హతకు తగిన ఉద్యోగాలు, గ్రామానికి పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామని చెప్పారు. బలవంతంగా ఎవరినీ పంపించదనీ, వారు అంగీకరిస్తేనే తరలిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.

పోగిళ్ల తరలింపు ప్రక్రియ తన దృష్ఠికి వచ్చిందని, గ్రామం విడిచి వెళ్లేవారికి తనవంతు సహకారం ఉంటుందని, గ్రామంలో ఉన్నవారికి కూడా అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే బాలూ నాయక్ చెబుతున్నారు. పోగిళ్ల గ్రామస్తుల అభిప్రాయం మేరకు తరలింపు ఉంటుందని అంటున్నారు. గ్రామ తరలింపులో ఎలాంటి బలవంతం లేదని, అయితే పూర్తిస్థాయిలో పునరావసం కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. నాడు సాగర్ ముంపు బాధితులుగా, నేడు పులుల సంరక్షణ పేరుతో మరో ప్రాంతానికి తరలింపు ప్రతిపాదనతో తమ జీవితాలతో ఎలాంటి మలుపు తిరుగుతుందోనని పోగిళ్ల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..