
పిల్లలకు షాక్ ఇస్తూ యావత్ ఆస్తిని దేవస్థానానికి రాసేశాడు ఓ తండ్రి. ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. చిన్న కోడూరు మండలం అలీపూర్‌కు చెందిన బాలయ్య అనే వ్యక్తి తన యావత్ ఆస్తిని పిల్లల పేరు మీద కాకుండా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి రాసేశాడు. ఎందుకిలా చేశాడు అనే ప్రశ్న అందరిలో మెదులుతూ ఉండొచ్చు. దీనికి సమాధానం ఇప్పడు చదువుదాం. పిల్లలు పుడితే ఒక తంట.. లేకుంటే మరో సమస్యలా మారింది ప్రస్తుత సమాజం. సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. తమ కడుపుకు కూడు ఉన్నా లేకపోయినా కన్న వారి కడుపు కోసం కాయాకష్టం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇలా అనేక ఇబ్బందులు, కష్టాలకు ఓర్చి తమ బిడ్డను ప్రయోజకుడిని చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఇది సమాజంలో కొందు స్వార్థం అనుంటే పొరబడినట్లే. తనకంటూ ఏమీ ఆశించక కేవలం పిల్లల భవిష్యత్తును గొప్పగా ఊహించుకోవడం స్వార్థం కాదు వందకు వందశాతం ప్రేమే అవుతుంది. అయితే అలాంటి ప్రేమ ఒక్కో సారి వికటిస్తే ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది. ఈ విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించాడు ఈ తండ్రి.
ఒకప్పటి లోకానికి నేటి సమాజానికి తేడా చాలా ఉంది. జన్మనిచ్చి.. మంచి విద్యను అందించి, కష్టం తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుని.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులకు.. కనీసం పట్టెడన్నం కూడా పెట్టకుండా కర్కషంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటి సమాజంలో కొందరు పిల్లలు. వృద్దాప్యంలో చేదోడు వాదోడుగా ఉంటారని భావించి దగ్గరకు చేర్చుకుంటే తీరని దుఖాన్ని మిగిలిస్తున్నారు. బరువని భావించి వృద్దాశ్రమాలకు తరిమేస్తున్నారు. బాధ్యత తీర్చుకునేందుకు ఒక అసిస్టెంట్‌ను పెట్టి సపరిచర్యలు చేపిస్తున్నారు మరి కొందరు. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవాన్ని చవి చూసిన బాలయ్య తాను కష్టపడి కూడబెట్టిన ఆస్తిపై కొడుకు కన్నేశాడని భావించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను కనిపెంచిన కుమారులు తనకు పట్టెడన్నం కూడా పెట్టట్లేదని.. సరిగ్గా చూసుకోవట్లేదని.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కొండగట్టు ఆంజనేయస్వామిని సమర్పించాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా దేవస్థానానికి వెళ్లి హుండీలో తన ఆస్తి పత్రాలు వేయాలని ప్రయత్నించారు. చివరి నిమిషంలో పూజారి అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. అయితే తన ఆస్తిపత్రాలను ఇలా హుండీలో వేస్తే న్యాయం జరగదని బాలయ్యకు నచ్చజెప్పాడు. ఒక వేళ ఆస్తి మొత్తాన్ని తన కుమారులకు కాకుండా దేవాలయానికి చెందాలంటే రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆలయ అధికారులను కోరారు. దీనిపై స్పందించిన ఆలయ అధికారులు బాలయ్య తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఈవిషయం ఇప్పటి వరకు తన కుమారులకు తెలియకపోవడం గమనార్హం. భవిష్యత్తులో ఈ విషయం తెలిస్తే ఎలా స్పందింస్తారో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..