Telangana: బాలికతో ఆటోడ్రైవర్ చాటింగ్.. అతడిని లైన్‌లోకి తీసుకున్న బాలిక తల్లి.. ఆ తర్వాత
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఓ బాలిక చేసిన తప్పిదం ఆమె తల్లిదండ్రులను హంతకులుగా మార్చగా, ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అయితే ఆ బాలిక చేసిన తప్పిదం ఏంటి..? బాలిక తల్లిదండ్రులు ఎందుకు అంత క్రూరమైన నిర్ణయం తీసుకున్నారో... తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంకు చెందిన మురళీరెడ్డి(41) క్యాబ్‌డ్రైవర్. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని బీరప్పనగర్‌లో భార్య ద్వారక(43), కుమార్తె(14)తో ఉంటున్నాడు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండేది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేది. తరచూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేది. ఈ పోస్టులతో బోరబండకు చెందిన ఆటో డ్రైవర్ కుమార్ ఆమెకు పరిచయం అయ్యాడు. తనకు తెలిసిన సినిమా దర్శకుల వద్ద సినిమా అవకాశాలు ఇస్తారని బాలికను నమ్మించాడు. దీంతో బాలిక 2023 సంక్రాంతి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి కుమార్ దగ్గరికి వచ్చింది. వారం పాటు అమీర్‌పేటలోని ఓ గదిలో బంధించాడు. కుమార్ వేధింపులు భరించలేక బాలిక తప్పించుకుని వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. పోలీసులు బాలికను ప్రభుత్వ బాలిక సంరక్షణ గృహానికి తరలించారు. కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించారు. ఈ క్రమంలో కూతురు.. ఆటో డ్రైవర్ కుమార్‌తో చేసిన చాటింగ్‌ను గుర్తించారు.
భార్యతో ట్రాప్…
ఎలాగైనా తాను కుమార్‌ను పట్టుకుని కుమార్తెను రక్షించాలనుకున్నాడు మురళీరెడ్డి. భార్యతో చెప్పి కుమార్‌తో చాట్ చేయించాడు. ద్వారక యువతిగా ఉన్నప్పటి ఫోటోలు పంపిస్తూ కుమార్‌ను ముగ్గులోకి దించింది. నెలన్నర చాటింగ్ తర్వాత మురళి.. 2023 మార్చి 10న ద్వారకతో మెసేజ్ పంపించి మియాపూర్‌లో ఉండే తన బావమరిది ఇంటికి రప్పించాడు. అక్కడ అతడ్ని బంధించి తీవ్రంగా చితకబాదారు. కూతురు ఆచూకీ చెప్పాలని కొట్టినా అతడు నుంచి సమాధానం రాలేదు. స్పృహ తప్పి పడిపోయిన కుమార్‌ను కారు డిక్కీలో వేసుకుని విజయవాడ వైపు వెళ్లారు.
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో మునగాల వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువలో కుమార్‌ను పడేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కుమార్ మృతదేహం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ వద్ద కాలువ ఒడ్డుకు చేరింది. పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి స్థానిక కొమరబండ చెరువు అంచున ఖననం చేశారు. కుమార్ హత్య తర్వాత బాలిక తల్లిదండ్రులు.. కుమార్ ఆటోకు ఉన్న నంబర్ ప్లేట్ మార్చి ఉపయోగిస్తున్నారు. దానిపై ఉన్న పేటీఎం క్యూఆర్ కోడ్‌ను మాత్రం తొలగించలేదు. ఆటోకు ఉన్న ప్రత్యేకమైన బంపర్‌ను కూడా అలాగే ఉంచారు. బాలిక అనాథశరణాలయంలో ఉందని తెలుసుకొని ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కుమార్ కనిపించకపోవడం, ఆటో కూడా దొరక్కపోవడంతో కుమార్ భార్య బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పట్టించిన టెక్నాలజీ…
ఈ నెల మొదటి వారంలో కుమార్ ఆటో మాదాపూర్‌లోని గూగుల్ కార్యాలయం దగ్గర ఉండడం అతడి బావమరిది మోహన్ చూశాడు. ఆటో వెనుక బంపర్ ఇతర ఆటోలకు భిన్నంగా ఉండడంతో అది తన బావదేనని గుర్తించి బోరబండ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆటో రిజిస్ట్రేషన్ నంబరు మీద ఉన్న ట్రాఫిక్ చలానాలను కొన్ని నెలల క్రితం చెల్లించినట్లు గుర్తించారు. ఇందుకోసం మురళి తన ఫోన్ నంబరు ఉపయోగించడంతో దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. హత్య చేసినట్లు అంగీకరించాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..