AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medak: పెట్రోల్ డబ్బలతో తహసిల్దార్ కార్యాలయనికి రైతులు.. ఎందుకంటే

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామ రైతులు ధాన్యం దిగుమతి ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు తరలించినప్పటికీ, మిల్లుల యాజమాన్యం అన్‌లోడ్ చేసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రోజుల తరబడి లారీలు మిల్లుల వద్దే నిలిచిపోవడంతో అద్దె భారం పెరగడంతో పాటు వర్షాల కారణంగా ధాన్యం పాడైపోతుందనే ఆందోళన నెలకొంది.

Medak:  పెట్రోల్ డబ్బలతో తహసిల్దార్ కార్యాలయనికి రైతులు.. ఎందుకంటే
Medak Farmers
P Shivteja
| Edited By: |

Updated on: Jun 11, 2026 | 12:45 PM

Share

అన్నదాతకు కష్టాలు తీరడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసిన తర్వాత కూడా రైతుల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామ రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు తరలించినప్పటికీ, మిల్లు యజమానులు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజుల తరబడి లారీలు మిల్లుల వద్దే నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగాయిపేట రైతులు పెట్రోల్ డబ్బాలతో కొల్చారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినూత్న నిరసన చేపట్టారు. తమ ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చేతికొచ్చిన పంట రోడ్లపాలు అవుతుండటం, లారీలు రోజుల తరబడి నిలిచిపోవడంతో అద్దె భారం పెరుగుతుండటం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోయి నష్టపోతామనే భయంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన ఓ రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, తోటి రైతులు మరియు పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటన అక్కడ కలకలం రేపింది.

“మేము ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో తూకం వేసి రైస్ మిల్లులకు పంపించాం. కానీ మిల్లుల యాజమాన్యం ధాన్యాన్ని అన్‌లోడ్ చేసుకోవడం లేదు. దీంతో లారీలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. లారీ డ్రైవర్లు అద్దెల కోసం ఒత్తిడి చేస్తున్నారు. వర్షం వస్తే ధాన్యం పూర్తిగా పాడైపోతుంది. అధికారులకు పలుమార్లు చెప్పినా స్పందించడం లేదు. అందుకే నిరసనకు దిగాల్సి వచ్చింది” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మిల్లుల్లో ధాన్యం దిగుమతి ప్రక్రియను వెంటనే ప్రారంభించి, తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. “ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోకపోతే మాకు చావడమే దిక్కు” అంటూ వారు తమ గోడును వెల్లగక్కారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us