Telangana: అమ్మ బాబోయ్.. మరీ ఇంత పోటీనా.. ‘9999’ నంబర్ ఎంత పలికిందో తెల్సా..?
జీహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని పెద్దలు అంటుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సరదా ఉంటుంది. అందుకోసం లక్షల అయినా ఖర్చుపెడతారు. అలానే తాము ఎంతో ఇష్టంగా కొనుక్కున్న వాహనాలకు.. ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసం వేలంలో లక్షలు పెట్టడానికి కూడా వెనకాడరు. తాజాగా..

సెంటిమెంట్ అని కొందరు, ప్రత్యేక గుర్తింపు కోసం ఇంకొందరు.. వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడుతూ ఉంటారు. వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఈ లిస్ట్‌లో ముందు వరసలో ఉంటారు. తాజాగా తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఒక ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయి ధర పలికింది.
హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణా కార్యాలయంలోని ప్రాంతీయ రవాణా అథారిటీ (RTA) అధికారులు “TGA 03A 9999” రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానించారు. ప్రభుత్వ బేస్ ప్రైజ్ రూ.50,000గా నిర్ణయించగా.. బిడ్డింగ్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. మే 27, మంగళవారం జరిగిన ఆన్‌లైన్ వేలంలో హనుమకొండ కావేరీ ఇంజనీరింగ్ యాజమాన్యం రూ.12.60 లక్షలు కోట్ చేసి అత్యధిక బిడ్‌తో నంబర్ దక్కించుకుంది. ఇంకా చాలామంది రూ. 12 లక్షల వరకు బిడ్లను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ రేంజ్‌లో పోటీ ఉందంటే ఫ్యాన్సీ నంబర్లపై జనాలపై ఎంత మోజు ఉందో అర్థం చేసుకోవచ్చు.
కారు ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.7.75 లక్షలు పెట్టిన బాలకృష్ణ
ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సైతం TG09 F0001 ఫ్యాన్సీ నంబరును అత్యధిక ధర పెట్టి దక్కించుకున్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన వేలంలో 0001 నంబరును రూ.7.75లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. త్వరలో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోబోయే బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్ దక్కించుకున్నట్లు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
