ఫ్యాన్సీ నంబర్‌ క్రేజ్‌.. ఒక్క రోజులో ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తెలంగాణలోని ఖైరతాబాద్ RTO ఆఫీసులో జరిగిన వేలంలో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లకు భారీ డిమాండ్ నమోదైంది. TG09F9999 నంబర్ రూ.12 లక్షలకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఇతర ఫ్యాన్సీ నంబర్లు కూడా అధిక ధరలకు అమ్ముడయ్యాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.42 లక్షల ఆదాయం లభించింది.

ఫ్యాన్సీ నంబర్‌ క్రేజ్‌.. ఒక్క రోజులో ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Fancy Number

Updated on: Jun 28, 2025 | 7:50 AM

చాలా మంది తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు కోరుకుంటారు. తమకు బాగా కలిసి వచ్చే నంబర్లు, తన పుట్టిన రోజు డిజిట్స్‌ వచ్చేలా, తమ అదృష్ట సంఖ్యలను తమ వాహనాలకు నంబర్లుగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం భారీగా ఖర్చు కూడా చేస్తారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఈ క్రేజ్‌ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా అది మరింత ఎక్కువైంది. బైక్ లేదా కారు కొన్నప్పుడు సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఆ సమయంలో ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకుంటారు. కొందరు ఏ నంబర్ అయితే ఏముంది అనుకుంటారు. కానీ మరికొందరు తమకు నచ్చిన నెంబర్ కోసం రూ. లక్షలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు.

వాహనదారుల్లో ఉండే ఈ ఫ్యాన్స్‌ నంబర్‌ క్రేజ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తోంది. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో నిర్వహించిన వేలంలో రికార్డు ధరకు ఫ్యాన్సీ నెంబర్లు అమ్ముడయ్యాయి. ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేలంపాట ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రోజులోనే ఏకంగా రూ.42 లక్షల ఆదాయం వచ్చింది. TG09F9999 నెంబర్ ను కీస్టోన్ ఇన్ ఫ్రా అనే సంస్థకు చెందిన వ్యక్తి రూ.12 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. అలాగే TG09G0001 నెంబర్ రూ. 5.66 లక్షలకు అమ్ముడైంది. TG09G0009 ఫ్యాన్సీ నెంబర్ ను రూ.5.25 లక్షలకు కొనుగోలు చేశారు. TG09G0006 నెంబర్ ను రూ.3.92 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ల విక్రయాలతో రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజులోనే రూ.42.1 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి