Snake Catcher: పాములంటే సహజంగా అందరికీ భయమే.. కనుచూపుమేరలో కనిపించినా.. భయంతో జంకుతుంటారు. ఇంకా దగ్గరగా ఉంటే.. భయంతో పరుగులు తీస్తారు. పొరపాటున కూడా ఎవరూ పాముల జోలికి వెళ్లరు.. కానీ ఈ వ్యక్తికి మాత్రం.. పాములంటే సరదా.. కనిపిస్తే పట్టుకొని అడవుల్లో వదిలేస్తాడు. సర్ఫాలు తన స్నేహితులు అనేలా వాటితో ఆడుకుంటాడు. అతనే.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన భరిగేల సమ్మయ్య.. సమ్మయ్యకు పాములంటే ఎంతో సరదా.. పాము కనపడితే జనం వాటిని చంపుతారేమో అని, ఎలాంటి ఆయుధం లేకుండా తన చేతులతోనే పట్టుకుంటాడు. ఆ తర్వాత సురక్షితంగా అడవులలో వదిలి తన మానవత్వం చాటుకుంటాడు. పాములపై ఉన్న భయాన్ని పారదోలడం కోసం వాటిని ప్లాస్టిక్ డబ్బాలో బంధించి ఆడుకుంటాడు.
అంతేకాదు పాములు అన్ని విషపూరితం కావని వాటిని చంపడం వలన పర్యావరణం దెబ్బతింటుందంటాడు సమ్మయ్య. పాములు అంతరించిపోవడం వల్ల పర్యావరణం మార్పులు చోటుచేసు కుంటాయని దీని ద్వారా ఎలుకల సంఖ్య పెరిగి ప్రకృతిలో తీవ్ర నష్టం జరుగుతుందని ప్రజలకు హితబోధ చేస్తున్నాడు. ప్రకృతి సంరక్షణకు మనమంతా కృషిచేయాంటూ ప్రజలను చైతన్యపరుస్తాడు. ఈ క్రమంలో నెల్లికుదురు మండల కేంద్రంలోని శంకర్ కిరాణం దుకాణంలోకి సోమవారం సాయంత్రం ఐదు అడుగుల కోడెత్రాచు పాము ప్రవేశించింది.
ఇది గమనించిన దుకాణదారుడు శంకర్ భయబ్రాంతులకు లోనై వెంటనే సమ్మయ్యకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న సమ్మయ్య.. త్రాచు పామును చాకచక్యంగా తన చేతులతో పట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. అనంతరం దానికి సమీపంలోని అడవిలో వదిలివేసి తన ధైర్యాన్ని చాటుకున్నాడు.
జీ. పెద్దీష్ కుమార్, టీవీ9 తెలుగు, వరంగల్.
Also Read: