AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయాడు అనుకున్న ఇంటి పెద్ద.. 24 ఏళ్ల తర్వాత తిరిగి సొంత గూటికి!

కొన్ని సంఘటనలు వినడానికి సినిమా కథల్లా అనిపించినా, నిజ జీవితంలో జరిగినప్పుడు అంతులేని ఆనందాన్ని, భావోద్వేగాలను కలిగిస్తాయి. చనిపోయాడని భావించి, ఆశలు వదిలేసుకున్న తమ కుటుంబ పెద్ద.. ఏకంగా పాతికేళ్ల తర్వాత కళ్ల ముందుకు వస్తే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి ఒక అద్భుతమైన మానవీయ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల సమయస్ఫూర్తి, బాధ్యతాయుతమైన కృషితో 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఒక వృద్ధుడు సురక్షితంగా తన పిల్లల చెంతకు చేరాడు. అసలేం జరిగిందంటే..

చనిపోయాడు అనుకున్న ఇంటి పెద్ద.. 24 ఏళ్ల తర్వాత తిరిగి సొంత గూటికి!
Missing man reunited with family
Diwakar P
| Edited By: |

Updated on: May 16, 2026 | 12:57 PM

Share

జోగులాంబ గద్వాల జిల్లా పూటన్‌పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ చారి (65) కి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు 24 సంవత్సరాల క్రితం ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయి తప్పిపోయారు. కుటుంబ సభ్యులు అప్పట్లో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఆయన ఇక లేరని భావించి ఆశలు వదిలేసుకున్నారు. ఇటీవల శుక్రవారం రాత్రి కామారెడ్డి పట్టణ పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ రవి కలిసి విధుల్లో భాగంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వారికి అనుమానాస్పదంగా ఒక వృద్ధుడు కనిపించాడు. వారు మానవత్వంతో ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి, ప్రేమగా పలకరించి పూర్తి వివరాలు సేకరించడానికి ప్రయత్నించారు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా కామారెడ్డి పట్టణ పోలీసులు వెంటనే గద్వాల పోలీసులను సంప్రదించి సమాచారం అందించారు.

గద్వాల పోలీసులు పూటన్‌పల్లి గ్రామంలో విచారించగా, 24 ఏళ్ల క్రితం సత్యనారాయణ చారి అనే వ్యక్తి తప్పిపోయిన విషయం నిజమేనని తేలింది. పోలీసులు పంపిన వృద్ధుడి ఫోటోను చూసిన కుమారులు, కుటుంబ సభ్యులు ఆనందంతో ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన తమ తండ్రేనని నిర్ధారించుకున్నారు. గద్వాల పోలీసుల సూచనతో కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి సమక్షంలో సత్యనారాయణ చారిని ఆయన కుమారులకు పోలీసులు అధికారికంగా అప్పగించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

పాతికేళ్ల తర్వాత తమ తండ్రిని చూసిన కుమారులు భావోద్వేగానికి గురై, తండ్రిని హత్తుకుని ఏడ్చేశారు. వృద్ధుడి ఆచూకీ కనుగొనడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ రవిలను సీఐ నరహరి ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, నెటిజన్లు కామారెడ్డి పోలీసుల మానవతా హృదయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us