ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
ప్రభుత్వ అధికారులు వస్తున్నామంటే సామాన్యులు ఎంతో గౌరవంతో, నమ్మకంతో తలుపులు తీస్తారు. కానీ, అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, అమాయక వృద్ధ దంపతులను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఎన్నికల అధికారులమని చెప్పి ఆ ఇంటికి వచ్చిన ఇద్దరు దుండగులు, వృద్ధ దంపతులను తమ మాటలతో మాయ చేశారు. విలువైన ఆభరణాలను కొట్టేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

బీబీనగర్, జులై 13: యాదాద్రి జిల్లా బీబీనగర్ లోని గౌడ కాలనీకి చెందిన కుక్కదువ్వు అండాలు, స్వామి దంపతులు వృద్ధాప్యంతో ఇంటి వద్ద ఉంటున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ నమోదు కార్యక్రమం (సార్)జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇద్దరు దుండగులు వృద్ధుల ఇంటికి వచ్చి తాము ఎన్నికల అధికారులమని మాటలు కలిపారు. ఇంకా SIR సర్వే ఫారం నింపనందునే తాము వచ్చామని, ముందుగా ఫొటో తీసుకుంటామని తెలిపారు. ఇందుకు వృద్ధ దంపతులు కూడా సరేనని అన్నారు. వృద్ధురాలు ఆండాలు ఫొటో దిగేందుకు సిద్ధం కాగా ఒంటిపై బంగారు పుస్తెల తాడు ఉంటే రేషన్ బియ్యం రాదని రాదు” అనే ఓ అబద్ధాన్ని సృష్టించి చెప్పారు.
దీంతో ఆ వృద్ధురాలు తన మెడలోని మూడు తులాల పుస్తెలతాడును తీసి పక్షవాతంతో కుర్చీలో కూర్చున్న భర్త స్వామి చేతికి ఇచ్చింది. తర్వాత ఆ ఇద్దరు ఫొటో తీసినట్లు నటించి.. ఫోటో సరిగ్గా రావడంలేదని.. ఇంటికి కొద్ది దూరంలో ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద అధికారులు ఉన్నారని అక్కడికి రావాలని నమ్మించారు. అక్కడికి వస్తే సర్వే ఫారం నింపుతారని చెప్పి ఆండాలును వెంట బెట్టుకుని దేవాలయం వద్దకు బయలుదేరారు. ఆమెను దేవాలయం వద్ద ఉండాలని, మరో ఇంటికి వెళ్లి సర్వే చేసి వస్తామని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులు ఆండాలు ఇంటికి వెళ్లారు. పక్షవాతంతో మంచంలో పడుకున్న భర్త స్వామి చేతిలో ఉన్న బంగారు పుస్తెల తాడును దుండగులు లాక్కుని పారిపోయారు.
కళ్ల ముందే తమ పుస్తెలతాడును దొంగలు అపహరించుకుపోతుంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు స్వామి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా ఆ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, సర్వే అని చెప్పి ఇంటికి వస్తే వెంటనే నమ్మవద్దని, వారి ఐడి కార్డులను (Identity Cards) అడిగి తెలుసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
