Telangana: ఒరేయ్ మిమ్మల్ని తగలెయ్య.. మనుషుల్ని బతకనివ్వరా..?

|

Jul 05, 2024 | 8:36 AM

కాదేది కవితకు అనర్హం.. ఇది.. ఒకప్పటి మాట.. కల్తీకి కాదేదీ అనర్హం.. ఇది ఇప్పటి మాట.. ఎస్‌.. ఇప్పటివరకు కేవలం ఆహార పదార్ధాలు మాత్రమే కల్తీ చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు ఏకంగా నకిలీ టాబ్లెట్స్‌ కూడా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రముఖ కంపెనీ పేరిట మందులు తయారు చేసి.. వాటిని మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ.. సీన్‌ రివర్స్‌తో హైదరాబాద్‌ పోలీసులకు ఫేక్‌ మెడిసిన్స్‌ గ్యాంగ్‌ అడ్డంగా బుక్కయింది.

Telangana: ఒరేయ్ మిమ్మల్ని తగలెయ్య.. మనుషుల్ని బతకనివ్వరా..?
Fake Medicine Factory
Follow us on

మేడ్చల్‌ జిల్లా పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి మేడ్చల్, డ్రగ్ కంట్రోల్, పేట్ బాషీరాబాద్ పోలీసుల దాడి చేశారు. ఆరు నెలలుగా ప్రముఖ కంపెనీల పేరుతో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో ఉండే ఫార్మా కంపెనీల పేర్లతో నకిలీ మందులు తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ దాడుల్లో నిందితుల నుంచి 50 లక్షల విలువైన నకీలీ మందులు, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. అటు.. నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్, రామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇక.. హైదరాబాద్‌ నిజాంపేట్‌ మధురానగర్‌లో ఉంటున్న గోపాల్‌ అనే వ్యక్తికి మందుల తయారీపై అవగాహన ఉంది. ఈ క్రమంలో.. గోపాల్‌కి ఢిల్లీకి చెందిన నిహాల్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరు ఒకే రంగంలో పనిచేస్తుడటంతో నకిలీ మందులు తయారు చేయాలని నిర్ణయించారు. పెద్ద కంపెనీలకు చెందిన మందులు తయారు చేస్తే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని భావించి మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలోని ఓ గోదాంలో నకిలీ మందులు తయారు చేయడం ప్రారంభించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌లోని ఉండే అసలు మందుల కంపెనీకి ఏమాత్రం తీసిపోని రీతిలో యంత్రాలు తెప్పించి నకిలీ మందులు తయారు చేస్తున్నారు. అందుకు.. గోపాల్‌కి రామకృష్ణ అనే వ్యక్తి సహాయం చేశాడు. దూలపల్లిలో తయారు చేసిన మందులను ఢిల్లీకి చెందిన నిహాల్‌ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు. అయితే.. ఈ వ్యవహారంపై పోలీసులు, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు కన్నేయడంతో ఫేక్‌ మెడిసిన్స్‌ గ్యాంగ్‌ గుట్టురట్టు అయింది. దీనికి సంబంధించి ఇద్దర్ని అరెస్ట్‌ చేయగా.. ఢిల్లీ కేంద్రంగా నకీలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహల్ అనే ప్రధాన నిందితుడు మాత్రం పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి.

మొత్తంగా.. నకిలీలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు, పోలీసులు కొన్నాళ్లుగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో ఇప్పటికే పెద్దమొత్తంలో మత్తుపదార్ధాలు పట్టుబడగా.. ఇప్పుడు ఏకంగా 50 లక్షల విలువైన నకిలీ మందుల తయారీ వ్యవహారం వెలుగులోకి రావడం షాకిస్తోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..