మహిళలే టార్గెట్.. బంగారం మాయమైన ప్రతిసారీ ఒకే స్టైల్.. అసలు గుట్టు బయటపెట్టిన సీసీటీవీ!
సోషల్ మీడియాను ఉపయోగించుకుని పరిచయాలు పెంచుకోవడం, ఆ తర్వాత చోరీలకు ప్రణాళికలు రచించడం.. రద్దీగా ఉండే బస్టాండ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను కాజేయడం.. ఇదీ ఓ అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా వ్యవహారం. ఫేస్‌బుక్ మెసేజ్‌ల ద్వారా పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా గుట్టును మెదక్ జిల్లా పోలీసులు రట్టు చేశారు.

హైదరాబాద్: సోషల్ మీడియాను ఉపయోగించుకుని పరిచయాలు పెంచుకోవడం, ఆ తర్వాత చోరీలకు ప్రణాళికలు రచించడం.. రద్దీగా ఉండే బస్టాండ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను కాజేయడం.. ఇదీ ఓ అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా వ్యవహారం. ఫేస్‌బుక్ మెసేజ్‌ల ద్వారా పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా గుట్టును మెదక్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 30 తులాల బంగారు ఆభరణాల చోరీ కేసును ఛేదించి, ఒక మహిళను అరెస్టు చేశారు. ఆమె నుంచి 25 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రాఖీ పండుగకు వచ్చి.. బంగారం పోగొట్టుకున్న మహిళ
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సూరం స్నేహ ఆగస్టు 26న రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులో రామాయంపేటకు వచ్చారు. అక్కడి నుంచి నిజాంపేటలోని పుట్టింటికి వెళ్లేందుకు మరో బస్సు ఎక్కారు. ప్రయాణ సమయంలో ఆమె బ్యాగులో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఇంటికి చేరుకున్న తర్వాత బంగారం కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీలు
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో మేకల సంధ్య అనే మహిళ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఆగస్టు 26న రామాయంపేట నుంచి నిజాంపేట వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తూ స్నేహ బ్యాగులోని బంగారాన్ని కాజేసి, మధ్యలోనే దిగి కారులో పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు చేసుకుంటూ చోరీలకు ప్రణాళికలు రూపొందించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రద్దీగా ఉండే బస్టాండ్లు, బస్సుల్లో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారి బ్యాగుల్లోని నగలు, విలువైన వస్తువులను అపహరించేవారని పోలీసులు తెలిపారు.
పలు జిల్లాల్లో చోరీలు.. నలుగురి కోసం గాలింపు!
హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలోని ఏ-1 నిందితురాలు రాధికపై మూడు కేసులు, ఏ-2 నిందితురాలు అక్షింతల సంధ్యపై 20 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ముఠాలో ఒకరిని మినహాయిస్తే మిగిలిన వారంతా బంధువులేనని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఆధారంగా నిందితురాలు మేకల సంధ్యను రామాయంపేట బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలకు పోలీసుల హెచ్చరిక!
బస్సులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మహిళలు తమ నగలు, నగదు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాగులను ఎప్పుడూ తమ పర్యవేక్షణలో ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
