Konda Vishweshwar Reddy : టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ, విద్యావంతుడు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు సమాచారమిచ్చేశారు. ఇక రేపో మాపో అధికారికంగా ప్రకటించడమే తరువాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా చేవెళ్ల నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయన క్రియాశీలకంగా ఉంటూనే కొంత కాలం వేచి చూసి ఇప్పుడు కమలం గూటికి చేరబోతున్నారు. మంచి విద్యావంతులుగా పేరున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతుండడం ఆ పార్టీ తెలంగాణ నేతల్లో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. తెలంగాణ బీజేపీకి కచ్చింతంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాక బలాన్నిస్తుందని బీజేపీ నేతలు, కార్యకర్తలు గట్టి నమ్మకంతో ఉన్నారు. జాతీయ స్థాయిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సముచిత స్థానం బీజేపీ ద్వారా దక్కుతుందని ఆయన అనుచరులు, అభిమానులు అభిలషిస్తున్నారు.