
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు పార్టీలో చేరబోతున్నారు. గులాబీ కండువ కప్పుకోనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసిన జీవన్ రెడ్డి.. శుక్రవారం (ఏప్రిల్ 10) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కలిశారు. ఎర్రవల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పార్టీ నేతలు స్వాగతం పలికారు.
ఇక ఫామ్‌హౌస్‌లో తనను కలిసిన జీవన్‌రెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు కేసీఆర్. శాలువాతో జీవన్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆ దేవుడే మీతో కలిసి పని చేయమని నన్ను పంపాడంటూ కేసీఆర్‌తో అన్నారు. కాసేపు మాట్లాడిన తరువాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్‌కు ఆహ్వానించారు కేసీఆర్.
అంతకుముందు టీవీ9తో మాట్లాడిన జీవన్ రెడ్డి 2014లోనే కేసీఆర్‌తో కలిసి రాజకీయ ప్రయాణం చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. కానీ నాడు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్‌లోనే కొనసాగానన్నారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ వార్షికోత్సవం ఉండటంతో.. ఆలోపే పార్టీలో జీవన్ రెడ్డి చేరిక ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ను కలిసి చర్చలు జరిపిన జీవన్ రెడ్డి ఎప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకునే తేదీని ఖరారు చేశారు.
ఏప్రిల్ 20న జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన సభాస్థలి, ఏర్పాట్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎల్. రమణ, విద్యాసాగర్ రావు పరిశీలన చేయనున్నారు.
ఇదిలావుంటే, కాంగ్రెస్‌తో 40ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలికిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. BRSలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఫ్యూచర్‌పై ఆయన తీసుకున్న నిర్ణయం.. పొలిటికల్‌గా నిప్పులు రాజేస్తోంది. అయితే, కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకిగా ఆవిర్భవించిన టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన జీవన్‌రెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కరుడుగట్టిన హస్తం వాదిగా మారిపోయారు. అలాంటి నాయకుడు ఇప్పుడిలా.. పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలు కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డికి ఏం తక్కువైందన్నది ఆ పార్టీ నేతలు అడుగుతున్న ప్రశ్న. అందుకు సీనియర్ నేత సైతం అదే తరహా సమాధానాలు సంధిస్తున్నారు.
జీవన్‌రెడ్డి మాత్రం.. కాంగ్రెస్‌తో ఇన్నేళ్ల ప్రయాణంలో.. మనోవ్యథ తప్ప మిగిలిందేంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక… అసలు కాంగ్రెస్ పక్కకు పోయి, నిజమైన కార్యకర్తలకు తీరని ద్రోహం జరిగిందంటూ.. తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటూ పార్టీకోసం కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం చేసి… కొత్తవారిని అందలం ఎక్కించారనీ… తమను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్టీలో తనపట్ల రెస్పెక్టే లేకుండా వ్యవహరించారని చెబుతున్నారు. దీనివల్ల మానసిక వేధన అనుభవించానని జీవన్ రెడ్డి అంటున్నారు. మొత్తానికి, జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం.. అభిమానం, అవమానం కలగలసిన గతస్మృతులతో ముడిపడి మంటలు పుట్టిస్తోంది. మరి, ఆయన కొత్త జర్నీ మున్ముందు ఎలా సాగుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..