తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: కిషన్ రెడ్డి
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, భారత సైన్యం సమర్థవంతంగా దాడి చేసిందని, అనేక ఉగ్రవాదులను అంతమొందించిందని తెలిపారు. ఈ దాడి ద్వారా భారతదేశం తన శక్తిని ప్రదర్శించిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. తిరంగా యాత్ర గురించి కూడా ఆయన వివరాలు వెల్లడించారు.

పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శనివారం చేపట్టబోయే తిరంగా యాత్ర గురించి ఆయన వివరాలు వెల్లడించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ” ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో పర్యాటకులపై పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా 26 మందిని కాల్చి చంపేశారు. మృతుల్లో 25 మంది భారతీయులు, మరొకరు నేపాల్ నుంచి వచ్చిన టూరిస్ట్ ఉన్నారు. ఈ ఉగ్రదాడి మానవత్వానికి సవాలుగా నిలిచింది. పిల్లల ముందు తండ్రిని, భార్యల ముందు భర్తలను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ప్రపంచంలో తొలిసారి జరిగింది. పెహల్గామ్ ఘటనను యావత్ దేశంతో పాటు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది.
ప్రధాని నరేంద్ర మోదీ సంఘటన జరిగిన రోజే విదేశీ పర్యటనను అర్థంతరంగా ముగించుకొని తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఉగ్రదాడి ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మానవ సమాజానికి సవాలుగా నిలిచిన, సెక్యులరిజానికి భంగం కలిగించి, దేశ సమగ్రతకు సవాలుగా మారిన ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ తరువాత మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప్రపంచం ప్రశంసించే విధంగా ధ్వంసం చేశారు. భారత సైన్యం ఉగ్రవాదుల ఇళ్ళు, శిబిరాలు, స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేశారు.
నేపాల్‌లో భారత విమానాన్ని హైజాక్ చేసి ఆప్ఘనిస్తాన్‌కు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసిన ఉగ్రవాదులు కూడా ఆపరేషన్ సిందూర్‌లో హతమయ్యారు. దశాబ్దాలుగా ఇండియాలో అనేక ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్ము కశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల వల్ల 46 వేల మంది, అలాగే ఇతర యుద్ధాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. గతంలో హైదరాబాద్ నగరంలోని లుంబినీ పార్క్, కోఠి చాట్ బండార్, దిల్ సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద ఉగ్రవాద బాంబుపేలుళ్లు జరిపి అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు. ఆనాడు సంఘటన జరిగిన ప్రాంతాల్లో నేను స్వయంగా వెళ్లి పరిశీలించాను. ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌ను మెహిదీపట్నం వద్ద దారుణంగా కాల్చి హత్య చేశారు. బీజేపీ కార్పొరేటర్ నందరాజ్ గౌడ్‌ను అంబర్ పేట్‌లో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు.
భారతదేశంలో పార్లమెంటుపై దాడి, తాజ్ హోటల్‌పై దాడి, ముంబైలోని లోకల్ ట్రైన్లలో పేలుళ్లు, విమానాల హైజాక్, దేవాలయాల ధ్వంసం వంటి అనేక ఉగ్రవాద దాడుల వల్ల వేలమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద ఘటనల తర్వాత క్యాండిల్ కాదు వెలిగించాల్సింది.. మిస్సైల్స్ వదలాలి.. బ్రహ్మోస్ ను వదిలి ఉగ్రవాదులను మట్టుబెట్టాలని, ఇండియా అంటేనే భయం పుట్టేలా ప్రధాని మోదీ గట్టి సమాధానమిచ్చారు. మోదీ నాయకత్వంలో భారత సమగ్ర విధానంతో సైనికులు తమ శక్తి, సామర్థ్యాలతో కొత్త చరిత్రను సృష్టించారు. 2005, 2006లో పాకిస్థాన్ ఉగ్రవాదులు ముంబై లోకల్ ట్రైన్ బాంబుపేలుళ్లు జరపడంతో అనేక మంది మరణించినప్పటికీ క్యాండిల్ ర్యాలీలకు మాత్రమే పరిమితమయ్యాం. కానీ ఈ రోజు భారత సైనికులు, భారత సైన్యం కొత్త చరిత్రను లిఖించారు. 2016లో పాక్ ఉగ్రవాదులు ఉరిలో మన సైనికులపై దాడి చేయగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
2019లో ఉగ్రవాదులు పుల్వామాలో 40 మంది సైనికులను చంపిన నేపథ్యంలో భారత ఎయిర్ ఫోర్స్ ఫైటర్ విమానాలు జైషే మహమ్మద్ హెడ్‌క్వార్టర్స్‌పై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్ 22న పెహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత మే 6,7 తేదీలలో కేవలం 23 నిమిషాల్లో భారత సైనికులు ఆపరేషన్ సిందూర్ పూర్తి చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు, ఐఎస్ఐ నెట్‌వర్క్‌ను కూడా ధ్వంసం చేశారు. పాకిస్థాన్ నుండి డ్రోన్లు భారత భూభాగంపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్ని డ్రోన్ ఘటనలు చోటు చేసుకున్నాయి. భారత సైనికులు పాక్ ఆర్మీ బేస్ లను కాకుండా, వారి ఆపరేషన్ స్థావరాలను, ఎయిర్ బేస లను, ఆర్మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. గతంలో లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కారణంగా భారత్ తీవ్ర నష్టాలను చవిచూసింది.
భారత్‌పై దాడులు చేస్తే ప్రతిదాడి కఠినంగా ఉంటుందని ఆపరేషన్ సిందూర్‌తో చెప్పాం. సుమారు 100 ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు, వారికి సహకరించే పాక్ సైనికులు కూడా చనిపోయారు. పాకిస్థాన్‌లోని భారత ఎంబసీని మూసివేసి, పాకిస్థాన్ వీసా కలిగిన వారిని దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఖాందహార్ విమాన హైజాక్, పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర వహించిన ఉగ్రవాదులు యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ లాంటి వారిని అంతమొందించాం. పాకిస్థాన్ ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో భారతదేశంలోని ఎయిర్ బేసులపై దాడి చేసి విమానాలను కూల్చివేశామని అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేస్తోంది. పాకిస్థాన్ చేసిన పిల్లచేష్టలతో కూడిన దాడులను భారత సైనికులు విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశాం. పూర్తిగా ఆగలేదు. రఫెల్ ఎయిర్ ఫైటర్, ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు సమయంలో కొందరు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాటి ప్రాధాన్యత, ఫలితాలను ప్రపంచం చూసింది.
భారత సైన్యానికి కావలసిన ఆయుధాలు, ఇతర మౌలిక సదుపాయాల దాదాపు 35 శాతం స్థానికంగానే తయారీ అవుతోంది. ప్రైవేట్ సెక్టార్తో భాగస్వామ్యం కూడా పెరిగింది. రక్షణ రంగ పరిశోధనలకు కావాల్సిన వసతుల కల్పన జరగుతోంది. ప్రపంచంలోనే భారతదేశాన్ని స్పేస్ రంగంలో అగ్రభాగానికి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నాం. పాకిస్థాన్ అంటే ఉగ్రవాద ఫ్యాక్టరీ. ఉగ్రవాదాన్ని తయారుచేసే డెమొక్రసీ ఫ్యాక్టరీగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించడంతోపాటు, వారిలో మానసిక ధైర్యాన్ని పెంచి అండగా నిలబడేందుకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నాం. రేపు (మే 17వ తేదీ) హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద జరగనున్న తిరంగా యాత్ర కార్యక్రమంలో అనేక ప్రముఖులను రాజకీయాలకు అతీతంగా ఆహ్వానించాం. తిరంగా యాత్ర కార్యక్రమం ప్రజలు నిర్వహించే ప్రోగ్రాం. ఒక కేంద్రమంత్రిగా, స్థానిక పార్లమెంటు సభ్యుడిగా నేను నా బాధ్యతగా తిరంగా యాత్ర కార్యక్రమంలో యువజన సంఘాలు, విద్యార్థులు, మహిళా సంఘాలు ఇలా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని భారత సైనికులకు సంఘీభావం ప్రకటించాలని ఆహ్వానిస్తున్నాను.” అని కిషన్ రెడ్డి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
