Etela Rajender Secret Report: బీజేపీ అగ్రనాయకుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హైదరాబాద్ పర్యటనపై రకరకాల ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. అందులోనూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లడం, ఏకాంతంగా చర్చించడం హాట్‌టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఆ భేటీలో హోంమంత్రి అమిత్ షాకు ఈటల రాజేందర్ ఒక నివేదిక ఇచ్చారట. ఆ నివేదిక ఏంటా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు హోం మంత్రితో ఈటల రాజేందర్ ఏం చర్చించారు? షా చేతికి ఇచ్చిన నివేదికలో ఏముంది ? అనేది పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తోంది.
సెప్టెంబర్ 17న అమిత్ షా టూర్ షెడ్యూల్ చివరిక్షణంలో సడెన్‌గా మారింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి అమిత్ షా వెళ్లాలని ఆకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు తెలంగాణ బీజేపీ ప్రత్యేక ఇంఛార్జ్ సునీల్ బన్సల్.. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆ తర్వాత అమిత్ షా షెడ్యూల్‌లో ఈటల నివాసానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య మరణించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు కేంద్ర హోంమంత్రి. అంత వరకు అది కామన్‌గానే అనుకున్నారంతా. పరామర్శ కార్యక్రమం ముగిసిన తర్వాత.. అమిత్ షాతో ఈటల రాజేందర్ దాదాపుగా 20 నిమిషాలు చర్చించారు. అక్కడే.. ఆ చర్చలో ఏం జరిగిందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మిషన్ 90..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అవసరమైన కార్యచరణ నివేదికను అమిత్ షా చేతికి అందించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా మిషన్ 90 రిపోర్ట్ లో కీలక అంశాలను పొందుపరిచి అమిత్ షాకు అందించారు. ఆ రిపోర్ట్‌లో పార్టీ బలంగా ఉండి బలహీనమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్టీ బలహీనంగా ఉండి బలమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీల జాబితా వివరాలు అందులో పొందుపరిచినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు, ప్రత్యర్థి పార్టీల బలహీనతలు, విధాన పరమైన హామీలు ఎలాంటివి ఇవ్వవచ్చు అనే దానిపై స్పష్టతతో కూడిన నివేదికను అందజేసినట్లు సమాచారం.
అయితే, ఈ నివేదికలో ఇంతే ఉందా? ఇంకేమైనా ఉందా? అన్న ప్రశ్నలు రాష్ట్ర కమలనాథులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అమిత్ షాకు ఇచ్చిన రిపోర్ట్‌లో ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా ? పార్టీ నేతల మధ్య సమన్వయంపై ఏమైనా ఫిర్యాదులు చేశారా? అన్నదానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. ఈటల రాజేందర్ మాత్రం అమిత్ షాతో చర్చపై నోరుమెదకపోవడం ఆసక్తిరేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..