రక్తబంధం లేకున్నా.. ఊరి బంధానికి విలువ ఇచ్చిన గ్రామస్థులు.. ఏం చేశారంటే..

| Edited By: Srikar T

Aug 12, 2024 | 5:28 PM

ఇంట్లో ఉన్న సొంత మనిషి చనిపోతేనే పట్టించుకోని ఈరోజుల్లో.. తనకంటూ ఎవరులేని ఓ వృద్ధురాలు మృతి చెందితే, ఊరు మొత్తం కలిసి ఆమెకు అంత్యక్రియలు చేసారు. సమాజంలో మానవత్వం అనేది కనుమరుగవుతున్న ఈరోజుల్లో వృద్ధురాలి కోసం ఊరే కుటుంబంగా మారడం అనేది గొప్ప విషయం అని చర్చించుకుంటున్నారు గ్రామస్థులు.

రక్తబంధం లేకున్నా.. ఊరి బంధానికి విలువ ఇచ్చిన గ్రామస్థులు.. ఏం చేశారంటే..
Sanga Reddy
Follow us on

ఇంట్లో ఉన్న సొంత మనిషి చనిపోతేనే పట్టించుకోని ఈరోజుల్లో.. తనకంటూ ఎవరులేని ఓ వృద్ధురాలు మృతి చెందితే, ఊరు మొత్తం కలిసి ఆమెకు అంత్యక్రియలు చేసారు. సమాజంలో మానవత్వం అనేది కనుమరుగవుతున్న ఈరోజుల్లో వృద్ధురాలి కోసం ఊరే కుటుంబంగా మారడం అనేది గొప్ప విషయం అని చర్చించుకుంటున్నారు గ్రామస్థులు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని రాంసాన్పల్లి గ్రామంలో రాములమ్మ (80) ప్రాణాలు విడిచారు. 25 ఏళ్ల క్రితం నాందేడ్- అకోలా జాతీయ రహదారిపై వెళ్తూ అందోలు మండలం రాంసానిపల్లి గ్రామానికి చేరుకుంది. గ్రామచావిడిలో నివాసం ఉంటూ ఆ ఊరి బిడ్డలా మారిపోయింది. ఆమెకు ఆకలి వేసినప్పుడల్లా ఏ ఇంటికి వెళ్లినా లేదనకుండా కడుపునిండా భోజనం పెట్టి పంపించే వారు ఆ ఊరి ప్రజలు. పండుగలకు బట్టలు కూడా గ్రామస్తులే ఎవరో ఒకరు తీసుకువచ్చే వారు.

ఏ ఇంటికి వెళ్లినా కానీ తమ కుటుంబంలో ఒక సభ్యురాలుగా చూసుకునే వారు అలాంటి రాములమ్మ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించింది. ఇన్నాళ్లు తమలో ఒకరిగా ఉన్న వ్యక్తి మరణించడంతో ఊరంతా బాధాతప్త హృదయాలతో శోకసముద్రంలో మునిగి పోయింది. ఆమెకు అనాథ శవంలా కాకుండా అందరూ ఉన్నవారిలా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఆ ఊరి ప్రజలు. గ్రామస్తులంతా విరాళాలు వేసుకొని ఎలాంటి లోటు లేకుండా సాంప్రదాయ రీతిలో రాములమ్మకి అంత్యక్రియలు నిర్వహించారు. రాములమ్మకు ఆదే గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి కొడుకు స్థానంలో నిలబడి తలకొరివి పెట్టాడు. రక్తసంబంధానికి విలువలు ఇవ్వని, ఈ ప్రస్తుత సమాజంలో కేవలం తమతో కలిసి ఉండి, తమ ఊరితో ఉన్న బంధానికి విలువనిచ్చిన ఆ గ్రామ ప్రజలని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ ఘటన చూసిన వారు చర్చించుకుంటున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..