
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ ఎలక్షన్‌లో స్వతంత్రులుగా పోటీ చేసి వారికి గుర్తుల కేటాయింపు పూర్తయ్యింది. వీటిల్లో కొన్ని కారును పోలిన గుర్తులు ఉన్నాయి. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటివి అచ్చం కారులాగే కనిపిస్తాయని ఇది తమకు ఎక్కడ చేటు చేస్తుందోననే ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
పోలింగ్ సందర్భంగా ఈవీఎంల్లో దగ్గర దగ్గర పోలికలు ఉండే గుర్తులుంటే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు అనేది BRS వర్గాలు చెప్పే మాట. ముఖ్యంగా వృద్ధులు తాము వేయాలనుకున్న పార్టీకి బదులు.. వేరొక పార్టీకి వేసే ప్రమాదముంది. అందుకే ఈ గుర్తులపై నాలుగైదేళ్ల నుంచి న్యాయపోరాటం చేస్తోంది BRS. గతంలో ఓసారి వీటిని ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించారు. అయితే ఈసారి ఎన్నికల సంఘం వీటి విషయంలో సమాధానం ఇవ్వలేదు. దీంతో BRS పార్టీ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ రెండిటినీ ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని, స్వతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తులను ఇవ్వొద్దంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది..
ప్రస్తుత ఎన్నికల్లో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థికి.. అలాగే షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు రోడ్డు రోలర్ గుర్తును ఇచ్చారు. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అలయన్స్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థులకు చపాతీ కర్ర, రోడ్డు రోలర్ గుర్తు దక్కింది. ఇక జనసేన గుర్తు గాజు గ్లాసు తెలంగాణలో ఫ్రీసింబల్ లిస్టులో ఉంది. శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్న రాజమహేంద్ర కటారి, సుబ్రమణ్య రాహుల్‌కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. కల్వకుర్తిలో ఎస్‌యూసీఐ పార్టీ అభ్యర్థి గుర్తు కూడా గాజు గ్లాసే కావడం విశేషం.
ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా గుర్తు అనేది ప్రధాన ఆయుధం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్థి పేరు కంటే పార్టీ గుర్తే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు తలనొప్పిగా మారాయి. ఇప్పుడే కాదు ప్రతిసారి ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంటోంది. బ్యాలెట్‌పై గుర్తును పోలిన గుర్తులు కేటాయించడంతో ఓటమి చెందిన వారూ ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…