Telangana: అంబులెన్సులో వచ్చి నామినేషన్‌.. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి..

అంబులెన్సులో దుబ్బాక చేరుకున్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి, అనంతరం వీల్‌ చైర్‌లో ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఇక అంతకు ముందు కొత్త ప్రభాకర్‌ రెడ్డి సతీమణి మంజులత స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌ రావు, పార్టీ నాయకులు హాజరయ్యారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

Telangana: అంబులెన్సులో వచ్చి నామినేషన్‌.. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి..
Kotha Prabhakar Reddy

Updated on: Nov 09, 2023 | 2:39 PM

మెదక్‌ ఎంపీ, దుబ్బాక నియోకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కత్తిపోటుకు గురైన ప్రభాకర్‌ రెడ్డి ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నామినేషన్‌ నేపథ్యంలో నేరుగా ఆసుపత్రి నుంచి దుబ్బాక చేరుకున్న ఎంపీ నామినేషన్‌ దాఖలు చేశారు.

అంబులెన్సులో దుబ్బాక చేరుకున్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి, అనంతరం వీల్‌ చైర్‌లో ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఇక అంతకు ముందు కొత్త ప్రభాకర్‌ రెడ్డి సతీమణి మంజులత స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌ రావు, పార్టీ నాయకులు హాజరయ్యారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ 30వ తేదీన దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. చెప్యాల గ్రామానికి చెందిన గటాని రాజు అనే వ్యక్తి మెదక్‌ ఎంపీని పొత్తికడుపులో పొడిచాడు. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌ రెడ్డిని వెంటనే గజ్వెల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయానికి ఆసుపత్రికి వెళ్లడంతో కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్యం మెరుగైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

50 వేల మెజారిటీతో గెలుపు ఖాయం..

కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్ధతుగా ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ కచ్చితంగా 50 వేల మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ జనాన్ని చూస్తే ప్రతిపక్షాల గుండెలు పేలిపోతాయన్నారు. కుట్ర వల్ల కత్తి పోటు గురై ప్రభాకర్ అన్న ఆసుపత్రిలో చికిత్స పొందారన్న మంత్రి హరీష్‌.. ప్రభాకర్ అన్న మంచి వ్యక్తని కొంత మంది రెచ్చ గొట్టి దాడి చేయించారని ఆరోపించారు. 4 గంటలు ఆపరేషన్ చేసిన ప్రాణం కాపాడారని, అమానుషంగా దుర్మార్గంగా కత్తితో దాడి చేశారన్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రభాకర్ రెడ్డి కావాలని పిలుపునిచ్చిన హరీష్‌.. ప్రతిపక్షాలు దుర్మార్గంగా మాట్లాడటం బాధాకరమన్నారు. చావు బతుకుల్లో ఉంటే మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇక ఇవి.. మంచి మనిషికి, కోతల మనిషికి జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించిన మంత్రి హరీష్‌ రావు.. గత ఎన్నికల్లో రైలు, టెక్స్ట్ టైల్ పార్క్, రైతులకు ఎడ్లు, రెవెన్యూ ఆఫీస్, మంగళ సూత్రం, ఆసుపత్రి, కాలేజీ, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారని, ఇందులో ఏవి రాలేవని గుర్తు చేశారు. దుబ్బాక ప్రజలు ఇమానాలు, ప్రమాణాలు నమ్మి మోసపోయారన్న మంత్రి హరీష్‌ రావు.. నూరు అబద్ధాలు ఆడి స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచాడరని ఆరోపించారు. కేసీఆర్ కు దుబ్బాక అంటే ఎంతో ప్రేమ అని హరీష్‌ తెలిపారు. కేసీఆర్ ప్రతిపాదించిన ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని హరీష్‌ ప్రజలను కోరారు.

కాంగ్రెస్‌పై విమర్శలు..

ఇక కాంగ్రెస్‌ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఉండగా ఎరువు బస్తాలు కావాలంటే పోలీసు స్టేషన్ లలో ఇప్పించారన్నార. కరెంట్ కోతల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 400 గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అందరికీ సన్నబియ్యం ఇవ్వబోతున్నామని, పింఛన్లు పెంచుకోబోతున్నామని, రూ. 5లక్షల బీమా ఇస్తామని చెప్పుకొచ్చారు. అసైన్డ్ భూములకు పట్టా ఇవ్వబోతున్నామని తెలిపిన మంత్రి హరీష్‌ రావు తమది మంచి మేనిఫెస్టో అని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..