
మద్యం మత్తులో కన్న కొడుకులు.. కసాయిలా మారుతున్నారు.. ఫుల్లుగా పీకలదాక తప్పతాగి తల్లిదండ్రులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది మూర్ఖులు అయితే ఏకంగా కన్నవారిని హత్య చేస్తున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని మద్యానికి డబ్బుల ఇవ్వాలంటూ.. ఓ కొడుకు చంపడం తెలంగాణలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మెదక్ మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన చాకలి నర్సవ్వకు ముగ్గురు కుమార్తెలు, ఓ కొడుకు రాములు ఉన్నారు. ఆడపిల్లల పెళ్లీళ్లు జరగ్గా… వారంతా అత్తారింట్లో ఉంటున్నారు. కొడుకు రాములుతో కలిసి నర్సవ్వ ఊర్లోనే ఉంటోంది.
కాగా రాములు తరచూ మద్యానికి డబ్బులు ఇవ్వమని తల్లి నర్సవ్వతో తరచూ గొడవ పడుతున్నాడు. ఆమెకు వృద్ధాప్య పింఛన్ వస్తుండగా, ఆ డబ్బులతో పాటు ఆమె వద్ద ఉన్న బంగారం ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండేవాడు. నాలుగు రోజుల క్రితం తల్లి జారి కింద పడటంతో చేయి విరిగింది. నాటు వైద్యం చేయిస్తానని బంధువులకు చెప్పాడు. దీంతో అందరూ నమ్మారు.. కానీ.. ఈ క్రమంలోనే మద్యం తాగేందుకు పింఛన్ డబ్బులు కావాలని తల్లిని బలవంత పెట్టాడు.
తల్లి డబ్బులివ్వాలంటూ చాలా సేపు బలవంతపెట్టాడు.. దీంతో ఆమె డబ్బులు లేవని కొడుకు కరాఖండిగా చెప్పింది.. దీంతో డబ్బులు ఎందుకివ్వవంటూ ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో.. తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు ఇంట్లో ఉన్న కర్రతో తల్లి పై ఇష్టారీతిన కొట్టగా.. ఆమె కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి.. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..