Jangaon: 2 క్వార్టర్స్ తాగాడు.. తిరుపతి వెళ్లడానికి ట్రైన్స్ లేకపోవడంతో..

తిరుపతి వెళ్లాలనుకున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు రైళ్లు దొరకకపోవడంతో బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సునే తీసుకెళ్లాడు. జనగామ నుంచి సూర్యాపేట రూట్‌లో 21 కిలోమీటర్ల మేర బస్సు నడిపిన అతడు.. టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం చేయడంతో దొరికిపోయాడు.

Jangaon: 2 క్వార్టర్స్ తాగాడు.. తిరుపతి వెళ్లడానికి ట్రైన్స్ లేకపోవడంతో..
Bus Stolen

Edited By:

Updated on: Jul 10, 2026 | 10:08 AM

ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తిరుపతి వెళ్దామనుకున్నాడు. రెండుసార్లు రైల్వే స్టేషన్‌కు వెళ్తే ట్రైన్స్ లేవని అక్కడ నుంచి పంపేశారు. బయటకు వచ్చి ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్న సమయంలో.. బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సు కనిపించింది. వెంటనే లోపలికి ఎక్కి టూల్ కిట్ ఉండటంతో బస్సు స్టార్ట్ చేశాడు. బస్టాండ్ చుట్టూ రౌండ్ వేసిన అతడు.. ఆ తర్వాత సూర్యాపేట రూట్‌లో 21 కిలోమీటర్ల మేర బస్సును నడిపాడు. అయితే టోల్‌ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంతో అతడి వ్యవహారం బయటపడింది. ఈ విచిత్ర ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన వెంకన్న ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడికి..  జనగామ బస్టాండ్ సమీపంలో పార్క్ చేసి ఉన్న TS 27 T 7231 నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు కనిపించింది. డ్రైవర్ సీట్లో కూర్చొని కాసేపు బస్సు నడుపుతున్నట్లు ప్రయత్నించాడు. అదే సమయంలో బస్సులోని టూల్‌బాక్స్‌పై తాళం కనిపించడంతో వెంటనే బస్సును స్టార్ట్ చేశాడు. ముందుగా బస్టాండ్ చుట్టూ ఒక రౌండ్ వేసి, అనంతరం సూర్యాపేట వైపు బయలుదేరాడు.

అర్ధరాత్రి సమయంలో సింగరాజుపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న వెంకన్న.. టోల్‌గేట్ డివైడర్‌ను ఢీకొట్టాడు. అనంతరం బస్సును రివర్స్ తీసే ప్రయత్నంలో మరోసారి ప్రమాదానికి కారణమయ్యాడు. పలుమార్లు రివర్స్ చేయడానికి ప్రయత్నించినా సరిగా చేయలేకపోవడంతో టోల్‌ప్లాజా సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే అతడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో బస్సు దొంగిలించి ఉండొచ్చని భావించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకన్నను అదుపులోకి తీసుకుని విచారించగా.. జనగామ బస్టాండ్ నుంచి బస్సును తీసుకొచ్చినట్లు తేలింది. దాదాపు 21 కిలోమీటర్ల మేర బస్సును నడిపినట్లు పోలీసులు గుర్తించారు.

విచారణలో వెంకన్న మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బస్సును దొంగిలించాలనే ఉద్దేశం తనకు లేదని, కేవలం ఒక్కసారి బస్సు నడపాలనే కోరికతోనే తీసుకెళ్లానని చెప్పినట్లు సమాచారం. మద్యం మత్తు, అలాగే అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us