
డాక్టర్లే ఆ శిశువులకు మేనమామలుగా మారారు. మానవత్వంతో శిశువులను తమ కుటుంబ సభ్యులుగా భావించి బారసాల కార్యక్రమం నిర్వహించారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వేడుక జరిగింది. పల్లిపాల వారోత్సవాల సందర్భంగా భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది ఆస్పత్రిలో 21 రోజుల క్రితం జన్మించిన ఇద్దరు శిశువులకు డాక్టర్లే మేనమామలుగా దగ్గరుండి బారసాల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం చేయడానికి ముందు బాధాకరమైన ఘటన జరిగింది. సరిగా డెలివరీ అయ్యే పరిస్థితి లేదు.. శిశువులు బతికే అవకాశం లేదు..అయినా డాక్టర్లు తీవ్రంగా శ్రమించి చికిత్స చేశారు. భద్రాచలంకు చెందిన వాణి అనే గర్భిణీ 980 గ్రాముల గురువు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. అలాగే చర్ల మండలం ఆరు కొత్తగూడెం గ్రామానికి చెందిన కూరపాటి సరస్వతి అనే గర్భిణీ కూడా కిలో బరువు ఉన్న శిశువుకు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 20 రోజుల క్రితం జన్మనిచ్చింది. తక్కువ బరువు ఉండటంతో అప్పటినుంచి ఆసుపత్రిలోని ఎస్ ఎన్ సియూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కాగా ఇప్పుడు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శిశువులకు పునర్జన్మ ఇచ్చిన డాక్టర్లే బారసాల చేయాలని తల్లిదండ్రులు కోరారు. దీంతో వైద్యులు పిల్లల్ని ఊయల్లో వేసి ఆస్పత్రిలో సిబ్బంది మధ్య బారసాల వేడుక నిర్వహించారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు