అసలే అడవుల జిల్లా.. అందులోనూ వెనుకబడిన ఆదివాసీల జిల్లా.. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం రాజీవ్‌గాంధీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. రిమ్స్‌ను ఏర్పాటు చేసింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిపి 148 పోస్టులను మంజూరు చేశారు. కానీ, నేడు ఇప్పుడు రిమ్స్‌లో అంతా కలిపి 89 మంది వైద్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 59 పోస్టులు భర్తీనే కాలేదు. దీనికితోడు తాజాగా ప్రభుత్వం సాధారణ బదిలీల కింద రిమ్స్ నుంచి 11 మంది వైద్యులను బదిలీ చేసింది. దీంతో వైద్యుల సంఖ్య 48కి పడిపోయింది. బదిలీ అయిన వారి ప్లేసుల్లో కేవలం ఒక్కరు మాత్రమే వచ్చి ఇక్కడ చేరారు. వైద్యులతో పాటు 70 మంది నర్సులను కూడా రిమ్స్ నుంచి బదిలీ చేశారు. ఇటు వైద్యులు, అటు నర్సుల భారీ కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలందించటం అసాధ్యంగా మారింది. పేదోడికి వైద్యం అందించాలన్న నాటి ప్రభుత్వ లక్ష్యం అందని ద్రాక్షలా మారింది.
మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2022లో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించి ప్రారంభించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా ఇదే దుస్థితి. సూపర్ స్పెషాలిటీలో 13 విభాగాలుండగా.. అందుకు తగ్గట్టుగానే 52 పోస్టులు మంజూరు చేశారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రెగ్యులర్ డాక్టర్ లేడిక్కడ. 16 మంది కాంట్రాక్టు వైద్యులతోనే కాలం నెట్టుకొస్తున్నారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో ఇప్పటికీ 36 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రిమ్స్ డైరెక్టర్‌గా జైసింగ్ రాథోడ్ బాధ్యతలు తీసుకున్నాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందనే భరోసా కలిగింది. ఇప్పుడిప్పుడే రిమ్స్ గాడిన పడుతుండగా.. ప్రభుత్వం సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను బదిలీ చేసింది. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల బదిలీ రోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని మండిపడుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతం.. పైగా సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం.. ఈ సమయంలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు జిల్లా వాసులు. తక్షణమే ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాపాలనలో ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..