
ఇద్దరు పెద్ద నేతలు. జిల్లాలో రాజకీయాలను శాసించగల శక్తి ఉంది. నిన్నటివరకు ఆ నేతలిద్దరూ కలవలేదు. మాటలు కూడా లేవు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతే వారి మధ్య సయోధ్యని కుదిర్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కీలక నేతల కొత్త ఫ్రెండ్‌షిప్ స్టోరీ ఇది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఇద్దరు బడా నేతలు డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు కలయిక ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన ఇఫ్తార్ విందులో డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ పాల్గొన్నారు. ఒకరినొకరు పలుకరించుకున్నడీకే, జూపల్లి.. కొద్దిసేపు ఇఫ్తాన్ విందులో పాల్గొని.. తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చేసిన జూపల్లి కృష్ణారావు మరోసారి బీజేపీలోకి ఆహ్వానించారు డీకే అరుణ.
డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరిదీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే. గతంలో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. ఒకే జిల్లా అయినప్పటికీ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడిచేది. ఎడముఖం పెడముఖంగా ఉండేవారు. జిల్లాలోనూ పార్టీలోనూ ఆధిపత్యం కోసం అనేక ఎత్తుగడలు హీట్ పుట్టించేవి. మారిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరితే.. జూపల్లి కృష్ణారావు గులాబీ గూటికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ ఓడిపోయారు. అరుణ బీజేపీలోనే కొనసాగుతుండగా.. గులాబీ పార్టీలో జూపల్లికి ఎదురుగాలి వీచింది. ఇప్పుడు పార్టీ వేటు వేయడంతో.. ఈ మాజీ మంత్రిపై బీజేపీ దృష్టి పడింది. పాత అంశాలను పక్కన పెట్టారో… కలిసి సాగాలని అనుకున్నారో.. లేక పార్టీ ఆదేశాలో కానీ.. డీకే అరుణ ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆ విందుకు జూపల్లి హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు.. రెండు రోజుల క్రితం జూపల్లి- బీఆర్‌ఎస్ ఎపిసోడ్ తర్వాత ఆమె ఫోన్ చేసి జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయినట్లేనా అని జిల్లా వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..