తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా ప్రతాల లీకేజ్ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్ క్వశ్చన్ పేపర్ ప్రత్యక్షం కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే పేపర్ లీకేజ్ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఎ.శ్రీదేవసేన తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై ఓ లెటర్‌ను విడుదల చేశారు.
లీకేజ్ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ కె.గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్ వేటు వేశారని వెల్లడించారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షలు ముందుకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని దేవసేన తెలిపారు. పేపర్ లీకేజీ పై పోలీసు విచారణ ఆధారంగానే చర్యలు తీసుకుంటుమాని.. రేపు యధావిధిగా సెకెండ్ లాంగ్వేజ్ పేపర్ ఎగ్జామ్ జరుగుతుందని వివరించారు. తదుపరి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..