జూరాల జల జగడంపై కీలక అడుగు.. కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ!
జూరాల జల జగడానికి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. ప్రాజెక్ట్ నుంచి రైతులకు నీటి విడుదల దిశగా కీలక ముందుడుగు వేసింది. కర్ణాటక ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటంతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేల బృందం భేటీ అయింది. బుధవారం (సెప్టెంబర్ 23) కన్నడ సీఎం డీకే శివకుమార్‌తో చర్చల తర్వాత జూరాల నీటి విడుదలపై తెలంగాణ మంత్రులు కీలక ప్రకటన చేయనున్నారు.

జూరాల జల జగడానికి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. ప్రాజెక్ట్ నుంచి రైతులకు నీటి విడుదల దిశగా కీలక ముందుడుగు వేసింది. కర్ణాటక ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటంతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేల బృందం భేటీ అయింది. బుధవారం (సెప్టెంబర్ 23) కన్నడ సీఎం డీకే శివకుమార్‌తో చర్చల తర్వాత జూరాల నీటి విడుదలపై తెలంగాణ మంత్రులు కీలక ప్రకటన చేయనున్నారు.
తెలంగాణ రాజకీయమంతా జూరాల చుట్టు తిరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణా జలాల కోసం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక వెళ్లింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి డీకే శివకుమార్‌తో భేటీలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న సుమారు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు పంటలను కాపాడేందుకు కృష్ణా జలాలను విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు కోరారు.
కృష్ణా నది నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని నెల రోజుల పాటు నిరంతరాయంగా విడుదల చేయాలని డీకే శివకుమార్‌కు తెలంగాణ బృందం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కీలక దశలో ఉన్న పంటలకు నీరు అందకపోతే దిగుబడులు, రైతుల ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీటిని నియంత్రిత పద్ధతిలో విడుదల చేయాలని, పొరుగు రాష్ట్రాల సహకార స్ఫూర్తితో కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తెలంగాణ మంత్రులు కోరారు. ఈ క్రమంలోనే.. బుధవారం ఉదయం 10గంటలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఇరిగేషన్ మంత్రి, అధికారులతో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నీటి పరిస్థితిపై పూర్తిస్థాయి సమీక్ష జరగనుంది. ఆ తర్వాత.. కృష్ణా జలాల విడుదలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇక.. బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తేనే నీళ్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటక వెళ్లారన్నారు మాజీమంత్రి హరీష్‌రావు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని కుప్పం తీసుకెళ్లిందని.. రేవంత్ మాత్రం సొంత జిల్లాలో పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. జూరాలలో నీళ్లు ఉన్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. అయితే.. జూరాలపై ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ హంగామా చేయకముందే లేఖ పంపామని.. ఈ నెల 20న కర్ణాటక సీఎంకు ఉత్తమ్ లేఖ పంపారని మంత్రి జూపల్లి వెల్లడించారు. జూరాల ఆయకట్టు రైతులను 100శాతం ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని మరో మంత్రి వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే.. కర్ణాటక వెళ్లి నీటి విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు.
ఇక.. జూరాల నుంచి నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. పంటలకు దశలవారీగా నీరు విడుదల చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీనిలో భాగంగానే.. కర్ణాటక టూర్‌కు ముందు సీఎం రేవంత్‌తో మహబూబ్‌నగర్ మంత్రులు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మాట్లాడారు. మొత్తంగా.. రైతులకు ఇబ్బందులు లేకుండా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ జూరాల నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిసైడ్ అయింది. మరి.. డీకే శివకుమార్‌తో జరిగే నేటి భేటీలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
