టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. మూఢనమ్మకాలు .. క్షుద్ర పూజలు.. గుప్తనిధుల కోసం తవ్వకాలు ప్రజల్ని వనికిస్తున్నాయి. పురాతన కట్టడాలు, పాడుబడిన నిర్మాణాల్లో గుప్తనిధుల కోసం కేటుగాళ్లు విచ్చలవిడి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తరహా గుప్త నిధుల వేటలో పలు సందర్భాల్లో అమాయకులను హతమారుస్తున్నారు. గుప్త నిధుల పేరుతో సాటి మనుషులనే బలి తీసుకుంటున్నారు. తాజాగా హనుమకొండలోని ఓ మాజీ ఎమ్మెల్యే మామిడి తోటలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.
హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలోని పాల డైరీ పక్కనే ఉన్న మామిడి తోటలో అనుమానాస్పదంగా ఓ గుంత కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు తోటలో గుంతను తవ్వి తిరిగి మట్టితో పూడ్చిపెట్టారు. పైన కత్తి పెట్టి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే, అక్కడ తవ్విన గుంతలో ఏదో ఉందని స్థానికులు భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటినా గ్రామానికి చేరుకున్న పోలీసులు..మామిడితోటలోని గుంతను తవ్వి చూశారు. ఆ గుంతలో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు గుర్తించారు. అమావాస్య రోజున ఇక్కడి తోటలో క్షుద్రపూజలు జరిపి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షుద్రపూజల కలకలంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విచిత్ర పూజలు జరిపిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.