పదిహేను రోజుల పాటు డప్పుల దరువులు, గజ్జెల మోతలు , గుస్సాడీ నృత్యాలతో దండారి పండుగను ఆదివాసీలు జరుపుకున్నారు. గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పండుగతో ప్రారంభమైన దండారి పండుగ.. దీపాల వెలుగుల్లో అమవాస్య రాత్రిలో కొలబొడి పండుగతో ముగియనుంది. ఎటు చూసిన పండుగ వాతవరణంతో ఆదివాసీ గూడాలు గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలుకుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా తుడుం మోతలు, డప్పుల చప్పుల్లు , గుస్సాడీ నృత్యాల ఆటపాటలే కనువిందు చేస్తున్నాయి. తరతరాల సంప్రదాయాన్ని తూచ తప్పకుండా పాటించే సంస్కృతి సంప్రదాయాల ఆదివాసీలు పాటిస్తున్నారు. ఓ వైపు కోలాటాలు, మరోవైపు గోండిపాటల నృత్యాలు, హాస్యనాటికల ప్రదర్శనలు అబ్బురపరుస్తున్నాయి. ఆశ్వీయుజ పౌర్ణమి అనంతరం ప్రారంభమైన ఈ వేడుకలు పక్షం రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగి దీపావళి కాంతుల్లో చివరి దశకు చేరుకుంటాయి.