Shamshabad Airport Road: కుండ పోత వానలకు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గులాబ్ తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. పలు జిల్లా ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఊరు, చెరువు ఏకమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు వరద కాల్వలుగా మారాయి. తుఫాన్ తీరం దాటినా.. దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. రెండు రోజులుగా జన జీవనం అస్తవ్యస్తమయ్యింది.
ఇటు హైదరాబాద్ మహానగరంపై గులాబ్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. నగరంతో పాటు, శివారులోని వందలాది కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. అటు భారీ వర్షాలకు గగన్‌పహాడ్ వద్ద అప్పా చెరువు అలుగు పోస్తుంది దీంతో జాతీయ జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే వాహనదారులతో పాటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లాల్సిన ప్రయాణికలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రహదారిపై వరద ఉధృతి పెరుగుతుండటంతో
పోలీసులు రహదారినిన మూసివేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, బెంగుళూరు వైపు వెళ్లే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ గుండా వెళ్లాలని సూచిస్తున్నారు.
గతేడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండటంతో అప్పా చెరువు కట్టకు గండి పడి జాతీయ రహదారి వరద నీటిలో కొట్టుకుపోయింది. పలు వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. గగన్‌పహాడ్ వద్దగల అప్పా చెరువు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఆ చెరువు ప్రస్తుతానికి పది ఎకరాలు
మాత్రమే మిగిలి ఉందని.. అందులో ఫ్యాక్టరీలు, గోడౌన్ వెంచర్లు, అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో చెరువు కుదించుకుపోయింది. అయితే, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరుతో చెరువు నిండిపోయింది. దీంతో చెరువుకట్టకు గండి పడే పరిస్థితి రావడంతో అధికారులు అప్రమత్తమై చెరువుకు గండి కొట్టి ఆ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వరద నీరు జాతీయ రహదారిపై చేరడంతో హైదరాబాద్ వైపు నుండి బెంగళూరు వైపు వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు.
అటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రోడ్డును కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అటుగా వెళ్లాల్సిన వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మళ్లించామని పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, జిల్లా అధికారులను అప్రమత్తం చేశామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో ఆర్డీవో, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అధికారుల అప్రమత్తతతోనే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.