Heavy Rains in Adilabad District: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు , వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదనీరు భారీగా చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా గర్భీణీలకు కూడా అవస్థలు తప్పటం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పురుటి నొప్పులతో అవస్థపడుతున్న గర్భిణీని అతి కష్టంమీద రోడ్డు దాటించారు స్థానికులు.
ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగు ప్రవాహ ధాటికి అక్కడున్న కల్వర్ట్ కొట్టుకుపోయింది. కల్వర్టు కూలడంతో జల్దా గ్రామానికి రాకపోకలు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా వాగు దాట లేక అంబులెన్స్ కల్వర్ట్ వద్దే ఆగిపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో ఇచ్చోడ మండలం జల్దా గ్రామానికి చెందిన జాధవ్ జయశ్రీ అనే గర్బిణీ అంబులెన్స్ లో చిక్కుకుపోయింది. మహిళ అవస్థ చూడలేక, అంబులెన్స్ ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో..స్థానికులతో కలిసి గర్బిణిని ఎత్తుకుని కల్వర్ట్ దాటించారు. జాతీయ రహదారిపైకి ఎక్కించి మరో అంబులెన్స్ లో ఇచ్చోడ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే, ఆదిలాబాద్, కోమరంభీం, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్.. జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి