
అప్పు..పెనుముప్పైంది. చివరకు ప్రాణాలు తీసింది. జీతం వేలల్లో…అప్పులు కోట్లలో ఉండటంతో తట్టుకోలేకపోయాడు. వడ్డీ పెరిగిపోయి..అప్పులిచ్చిన వారి టార్చర్ ఎక్కువైపోయింది. ఎలా తీర్చాలో తెలియక..దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సూర్యాపేటజిల్లా( Suryapet district)లో జరిగింది. మునగాల మండలం(Munagala mandal) విజయరాఘవపురం(Vijayaraghavapuram)లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అందిన కాడికి అప్పులు చేసి.. వాటిని తీర్చలేక గోదేశి నరేంద్రబాబు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన గవర్నమెంట్ టీచర్‌గా పనిచేసేవాడు. సుమారు 25 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అప్పులిచ్చిన వాళ్లకు ఇన్నాళ్లు ఏదో ఒకటి చెప్తూ వచ్చిన నరేంద్రబాబు.. ఇక, అప్పులు తిరిగి చెల్లించలేననే నిర్ణయానికి వచ్చాడు. సూర్యాపేట వెళ్లి ఉరేసుకున్నాడు. డెడ్‌బాడీని ఊళ్లోకి తీసుకొచ్చేందుకు నరేంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. అప్పులోళ్లు అడ్డుకున్నారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి చెల్లిస్తేనే.. డెడ్‌బాడీని ఊర్లోకి రానిస్తామంటున్నారు. డెడ్‌బాడీని తీసుకొచ్చిన వెహికల్ ఊళ్లోకి రాకుండా.. రోడ్డుపై ముళ్ల కంచె వేశారు. అంత్యక్రియలు జరగనిచ్చేది లేదంటూ బాధితులు చెప్తున్నారు.
అయితే తన భర్త చేసిన అప్పులు గురించి తనకేం తెలియదంటోంది నరేంద్రబాబు భార్య. గవర్నమెంట్ టీచరైన నరేంద్రబాబు.. కోట్ల రూపాయల్లో అప్పులు ఎందుకు చేశాడు..? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు పెట్టి మోసపోయాడా..? మేటర్ పోలీసులకు వరకు వెళ్లడంతో.. విజయరాఘవాపురంలో ఉద్రిక్తత నెలకొంది.