Lockdown More Strictly: కరోనా నియంత్రణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేస్తోంది. ఉదయం 10 తర్వాత బయట తిరిగేవారిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు.
ప్రధాన రహదారులతో పాటు.. కాలనీ రోడ్లలోనూ పోలీసుల తనిఖీలు చేపడుతున్నారు. తొమ్మిది రోజులుగా తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ప్రధాన రహదారులు, మెయిన్ సెంటర్లలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ, గల్లీలు, కాలనీల్లో జనాలు కొంత వరకు బయటకు వస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే వాహనాల్ని సీజ్ చేయాలని ఆదేశించారు డీజీపీ మహేందర్‌రెడ్డి. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు కాలనీలు, అంతర్గత రహదారుల్లో పోలీసు నిఘా విస్తృతం చేయాలని సూచించారు. కమిషనర్లు, ఏసీపీలు ఉదయం 9.45 గంటలకే క్షేత్రస్థాయిలో పరీస్థితులను సమీక్షించారు. 10 గంటలకు అన్ని గస్తీల్లో వాహనాలు సైరన్ మోగించాయి. కరోనా వ్యాప్తికి అవకాశమున్న చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. లాక్‌డౌన్ ఉల్లంఘించి తిరిగే వాహనాల జప్తుకు డీజీపీ ఆదేశించారు.
లాక్‌డౌన్ నిబంధనలను నగరవాసులు కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మరింత సీరియస్‌గా లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు. సీజ్ చేసిన వాహనాలను పొందాలంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని.. అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన వారు ఎవరు రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు పోలీసులు. గురువారం వాహనాల తనిఖీలో భాగంగా నకిలీ పాసుల గుర్తించారు అధికారులు. చాలా మంది అత్యవసర సేవల పేరుతో నకిలీ పాసులను సృష్టించినట్టు తేలింది. కేవలం పదినిముషాల్లోనే.. 20కిపైగా నకిలీ పాసులను గుర్తించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ అమలును రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వ్యక్తిగతంగా వాహనాలను తనిఖీ చేశారు. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు నుండి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎవరైనా అనవసరంగా బయటికి వస్తే తాట తీస్తాం అంటున్నారు.
హైదరాబాద్‌లో లాక్ డౌన్ మరింత కఠినతరం చేసామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మోటార్ వెహికల్ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. సీజ్ చేసిన వాహనాలను తీసుకోవాలంటే నెల రోజులకు పైగా సమయం పడుతుందని.. నగర వాసులు లాక్ డౌన్ సమయంలో రోడ్ల పైకి వచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని హెచ్చరించారు సీపీ సజ్జనార్.
#Lockdown enforcement in #Rachakonda. #CP_Rachakonda Sri.#Mahesh_Bhagwat_IPS personally joined duties of checking unwanted movement of vehicles & warned #violators moving without reason to #seize vehicles for #lockdown violation. @TelanganaDGP @TelanganaCOPs @IPS_Association pic.twitter.com/FTSRGzoP21
— Rachakonda Police (@RachakondaCop) May 20, 2021