Covid-19 vaccination in Telangana: తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తగినన్ని టీకా నిల్వలు లేని కారణంగా 45 ఏళ్లు పైబడిన వారికి రేపు (సోమవారం) రెండో డోసు కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి వెల్లడించింది. కేంద్రం నుంచి సరిపడా డోసులు సరఫరా కాకపోవడం వల్ల టీకా నిల్వలు నిండుకున్నాయని, దీంతో వ్యాక్సినేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. వ్యాక్సినేషన్ ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది. టీకా డ్రైవ్‌ను తిరిగి ప్రారంభించే ముందు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. కాగా.. తెలంగాణలో శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉంటే.. తెలంగాణలో కొత్తగా 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. దీంతోపాటు గత 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 27మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 2,955 కు పెరిగింది. తాజాగా కరోనా నుంచి 5,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 4,74,899కు చేరుకుంది. రాష్ట్రంలో 50,969 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 658 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతరం మేడ్చల్ మల్కాజిగిరిలో 239, రంగారెడ్డిలో 326, ఖమ్మంలో 151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Also Read:
Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).